Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు(జూన్ 7) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా నగరంలోని అన్ని మండలాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని ఇతర జిల్లాలో జూన్ 11 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడతాయని వెల్లడిస్తూ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా జూన్ 10 వరకు హైదరాబాద్ సిటీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కర్ణాటకలోని చాలా ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించాయని IMD గురువారం ప్రకటించింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. నిన్న హైదరాబాద్‌లోని పలు మండలాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలు నీటి ఎద్దడి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్రమైన వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక పిడుగుపాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్కరు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది.
