Vikarabad: వీకెండ్‌లో ఫన్ కోసం వెళితే లైఫ్ రిస్క్ – వికారాబాద్ జిల్లాలో ప్రాణాలు తీసే రిసార్ట్!
వీకెండ్ వచ్చిందని కాసింత ఫన్ దొరుకుతుందని సరదాగా బోటింగ్ కోసం వెళ్తున్నారా ? వికారాబాద్ లాంటి టూరిస్ట్ డెస్టినేషన్‌లో బోటింగ్ కోసం బయలుదేరారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. అక్కడ కొన్ని బోటింగ్ నిర్వహణ సంస్థలు అనుమతుల్లేకుండా దందా చేస్తున్నాయి. సరదా మాట దేముడెరుగు..? ప్రాణాలు పోగలవు జాగ్రత్త.

వికారాబాద్ మండలం… సర్పన్ పల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్. కానీ.. అక్కడ సాగునీటి పనుల కంటే.. ఎక్‌ట్రాలే ఎక్కువగా జరుగుతుంటాయి. రిసార్ట్‌ల పేరుతో అమ్యూజ్‌మెంట్ దందాకు పాల్పడుతూ పర్యాటకుల నుంచి పైసావసూల్‌కు పాల్పడుతున్నారు.
అక్కడో ప్రైవేట్ రిసార్ట్.. పేరు ‘ది వైల్డర్నెస్ క్యాంప్ సైట్’… ముచ్చటైన కుటీరాల్లాంటి నిర్మాణాలు, ఏకాంతాలతో అలరించే గుడారాలు… ఆహ్లాదకరమైన వాతావరణం రారమ్మని పిలుస్తుంటుంది. ఔటింగ్‌కు వచ్చినాళ్ల కోసం బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
సరదాగా గడుపుదామని వచ్చిన ఓ బీహార్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది ఈ అందమైన రిసార్ట్. బోటింగ్ చేద్దామని ప్రాజెక్టులోకి వెళ్లి రేటా కుమారి, పూనమ్ సింగ్ అనే ఇద్దరు మహిళలు ప్రాణాలే పోగొట్టుకున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనతో ఆ రిసార్ట్ అసలు రూపాన్ని బైటపెట్టింది. టూరిజం, ఇరిగేషన్ శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఐదేళ్ల నుంచి అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు.
ఉన్నతాధికారులకు పెద్దమొత్తంలో లంచాలిచ్చి ఇరిగేషన్ శాఖను మేనేజ్ చేసి ఇక్కడ రిసార్ట్ నడుపుతూ.. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరిగే అక్రమ బోటింగ్‌పై మీడియాలో వరుస కథనాలు వచ్చినా.. ఇరిగేషన్ అధికారుల్లో చలనం లేదు. తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కొన్ని రోజుల పాటు బోటింగ్ ఫెసిలిటీని నిలిపివేసినా… మళ్లీ యధావిధిగా కొనసాగిస్తున్నారు.
అసలే వర్షాకాలం.. ఆపై ఈదురుగాలులు.. కాలం చెల్లిన ఎలక్ట్రిక్ బోట్లలో లాహిరి లాహిరి.. ఇంకేముంది? మునిగిపోవుడే. ప్రాణాంతకంగా మారుతున్న ఈ పడవ ప్రయాణంపై ఓ నజర్ వేసేదెవరు? అనుమతుల్లేకుండా నడుస్తున్న అక్రమ రిసార్ట్ అంతు చూసేదెవరు? అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.