Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సిగాచి ప్రమాదం – 42కు చేరిన మృతుల సంఖ్య

ఎటు చూసినా ఆర్తనాదాలే...! ఎవరిని కదిపినా కన్నీటి వ్యథలే...! యస్‌.. పాశమైలారం సిగాచి ప్రమాదంలో చోటుచేసుకుంటున్న హృదయవిదారక ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. కార్మికుల మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ఫ్యాక్టరీలో ఏకంగా తవ్వకాలు జరుపుతుండటం చూసి బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్నాయి. ఒక్క అవశేషం దొరికినా చాలంటూ నీళ్లునిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 42కి చేరిందని ప్రకటించారు అధికారులు.

Hyderabad:  సిగాచి ప్రమాదం -  42కు చేరిన మృతుల సంఖ్య
Sigachi Chemical Industry Blast
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2025 | 9:41 PM

Share

ఎటు చూసినా ఆర్తనాదాలే…! ఎవరిని కదిపినా కన్నీటి వ్యథలే…! సిగాచి ప్రమాదంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాల తరహాలో మనుషుల అవశేషాలను వెతుకుతుండటం చూసి బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. కడసారి చూపుకైనా నోచుకోలేదు… కనీసం తమవాళ్లకు సంబంధించిన ఒక్క అవశేషం దొరికినా చివరి కార్యాన్నైనా జరుపుతామంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. పేలుడు ధాటికి కొందరి శరీర భాగాలు యంత్రాలకు అతుక్కోవడం చూసి అల్లాడిపోతున్నారు.

సిగాచి పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఆచూకీ లేని 9మందిలో ఆదివారం ఒకరిని గుర్తించారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా అవశేషాలు గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిశ్రమలో ఇంకా లభించని ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ ముమ్మరం చేశారు. అణువణువు జల్లెడపడుతున్నారు. ఇలా గుణపాలతో కార్మికుల అవశేషాలను గుర్తించేందుకు NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇటు ప్రమాదంలో తీవ్రగాయాలైన 18 మంది ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు15 బోన్ శాంపిల్స్‌ను DNA రిపోర్ట్స్ కోసం పంపించారు. ఇదిలావుంటే.. సేఫ్టీ రూల్స్‌ పాటించకపోవడంతోనే సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం నియమించిన హైలెవల్‌ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తే సిగాచి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రమాదంపై కన్నెర్ర చేస్తున్నాయి కార్మిక సంఘాలు. పరిశ్రమ దగ్గర పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కార్మిక నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పరిశ్రమ లోపలికి అనుమతివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కనీసం మిస్సయినవారి ఆచూకీనైనా వెంటనే కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తంగా… ఓవైపు బాధిత కుటుంబాల ఆర్తనాదాలు… మరోవైపు కార్మికుల అవశేషాలు గుర్తించేందుకు అధికారుల ప్రయత్నాలు… ఇంకోవైపు న్యాయం కోసం కార్మిక సంఘాల ఆందోళనలతో పాశమైలారంలో భారీగా మోహరించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి