Hyderabad: జంట జలాశయాల నుంచి నీటి విడుదల.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. రెండు రోజుల పాటు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు జలమండలి అధికారులు. ఈక్రమంలో రెండు జలాశయాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. హిమాయత్ సాగర్ ఒక గేటు 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు జలవనరుల శాఖ అధికారులు. హిమాయత్ సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులుగా ఉంది. మూసీలోకి 340 క్యూసెక్కులను విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 2.45 టీఎంసీలుగా కొనసాగుతోంది.
మరోవైపు ఉస్మాన్ సాగర్ 2 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1800 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు 226 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.95 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 3.90 టీఎంసీలు కాగా, ప్రజెంట్ నీటినిల్వ 3.43 టీఎంసీలు ఉంది. జంట జలాశయాల గేట్లు ఎత్తకముందే లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. మూసి ఒడ్డున ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతాలు చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసా నగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లు అర్జెంటుగా ఖాళీ చేసి రెండు రోజుల పాటు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని డిఆర్ఎఫ్ బృందాలు అనౌన్స్ చేశాయి.
ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేత