Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తస్మాత్‌ జాగ్రత్త.. దాడులకు కేంద్రాలుగా మారుతున్న హోటళ్లు..!

Hyderabad News: హైదరాబాద్‌తోపాటు చాలాప్రాంతాల్లో హోటళ్లు, బార్లు వినియోగదారులపై దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయి. వీకెండ్‌లో పిల్లాపాపలతో వెళ్తున్న వినియోగదారులపై సిబ్బంది దాడులు కలవరపెడుతున్నాయి. కండకావరమో.. బలుపో తెలియదుగాని.. దేవుడిలా చూడాల్సిన వినియోగదారులపై హోటల్‌ సిబ్బంది విరుచుకుపడుతున్నారు. ఆర్డర్‌ ఇచ్చింది తేకపోగా.. ఫ్రీగా ఇస్తున్నట్లు ఫోజు కొడుతున్నారు. పైపెచ్చు దాడులకు దిగుతున్నారు. మొన్నటికిమొన్న హైదరాబాద్‌ నడిబొడ్డున పంజాగుట్ట మెరిడియన్‌ హోటల్‌ ఘటన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

Hyderabad: తస్మాత్‌ జాగ్రత్త.. దాడులకు కేంద్రాలుగా మారుతున్న హోటళ్లు..!
Hotel
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Sep 13, 2023 | 7:13 AM

Hyderabad News: హైదరాబాద్‌తోపాటు చాలాప్రాంతాల్లో హోటళ్లు, బార్లు వినియోగదారులపై దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయి. వీకెండ్‌లో పిల్లాపాపలతో వెళ్తున్న వినియోగదారులపై సిబ్బంది దాడులు కలవరపెడుతున్నాయి. కండకావరమో.. బలుపో తెలియదుగాని.. దేవుడిలా చూడాల్సిన వినియోగదారులపై హోటల్‌ సిబ్బంది విరుచుకుపడుతున్నారు. ఆర్డర్‌ ఇచ్చింది తేకపోగా.. ఫ్రీగా ఇస్తున్నట్లు ఫోజు కొడుతున్నారు. పైపెచ్చు దాడులకు దిగుతున్నారు. మొన్నటికిమొన్న హైదరాబాద్‌ నడిబొడ్డున పంజాగుట్ట మెరిడియన్‌ హోటల్‌ ఘటన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. స్నేహితులతో కలిసి లంచ్‌కు వెళ్లారు కొందరు. బిర్యానీ ఆర్డర్‌ చేశారు. అందులో కలపుకునేందుకు పెరుగు తీసుకురావాలని పదేపదే సిబ్బందిని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు వినియోగదారులు.

ఇది భరించలేని హోటల్‌ సిబ్బంది.. వినియోగదారులపై దాడికి దిగారు. పరస్పరం కాసేపు కొట్టుకున్నారు. ఈ దాడుల్లో ఓ వినియోగదారుడికి తీవ్రగాయాలయ్యాయి. వినియోగదారుల ఫిర్యాదుతో అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు.. అటు వినియోగదారులు, ఇటు హోటల్‌ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హోటల్‌ సిబ్బంది దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఓ వినియోగదారుడి పరిస్థితి విషమంగా మారడంతో స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లియాఖత్‌ అలీ అనే బాధితుడు చనిపోయాడు. అతడి మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు లియాఖత్‌ బంధువులు, స్నేహితులు. పోలీసులు సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే.. లియాఖత్‌ బతికేవాడని ఆరోపించారు. ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ ఎస్‌ఐతోపాటు మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. అనంతరం వినియోగదారులపై దాడులు చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

దాబాలో భోజనం చేసిన పదిమందికి అస్వస్థత..

సంగారెడ్డి జమ్‌జమ్‌ దాబా హోటల్‌ నిర్వాకానికి పదుల సంఖ్యలో వినియోగదారులు అనారోగ్యంపాలయ్యారు. శుభ్రత, శుచి లేని వంటకాలు తిని ఆసుపత్రిపాలయ్యారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తే.. ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు బాధితులు. జమ్‌జమ్‌ హోటల్‌లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన వారిని హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు వంద మంది అనారోగ్యం బారిన పడినట్లు చెబుతున్నారు.

కోహినూర్‌ బార్‌లో గొడవ..

హైదరాబాద్‌ పాతబస్తీ ఫలక్‌నుమాలోని కోహినూర్‌ బార్‌లో సైతం నిర్వాహకులు, వినియోగదారుడి మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. బార్‌ నిర్వాహకుల దాడిలో కస్టమర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరస్పర ఫిర్యాదులతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మొత్తంగా హోటళ్లు, బార్లు దాడులకు కేంద్రంగా మారాయంటున్నారు వినియోగదారులు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ హోటళ్లు, బార్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. కార్డెన్‌ సెర్చ్‌ మాదిరిగా హోటళ్లు, సిట్టింగ్‌ సెంటర్లు, బార్లలో దాడులు చేస్తే.. ఇలాంటి ఘటనలు జరక్కుండా నివారించవచ్చంటున్నారు. చూడాలి మరి వినియోగదారులు వినతిని పోలీసులు ఏమేరకు పట్టించుకుంటారో?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..