Hyderabad: రెచ్చిపోయిన పోలీసులు.. జిమ్ ట్రైనర్ ను కింద పడేసి, కాళ్లతో తొక్కి
హైదరాబాద్(Hyderabad) పోలీసులు రెచ్చిపోయారు. పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్ అంటే ఎలా ఉంటుందో ఓ జిమ్ ట్రైనర్‌కి రుచి చూపించారు. థర్డ్ డిగ్రీకి తక్కువ అన్నట్టుండే ఈ దాష్టీకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సెన్సేషన్‌గా...
హైదరాబాద్(Hyderabad) పోలీసులు రెచ్చిపోయారు. పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్ అంటే ఎలా ఉంటుందో ఓ జిమ్ ట్రైనర్‌కి రుచి చూపించారు. థర్డ్ డిగ్రీకి తక్కువ అన్నట్టుండే ఈ దాష్టీకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. నలుగురు పోలీసులు రౌండప్ చేసి, నిందితుడి కాళ్ల మధ్య కర్ర పెట్టి కొట్టిన వైనం దారుణాతిదారుణంగా ఉంది. చిలకలగూడ పీఎస్ పరిధిలోని మెట్టుగూడలో(Mettugooda) జరిగింది ఈ అమానవీయ ఘటన. పోలీసుల దాష్టీకానికి గురై తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ఆ జిమ్ ట్రైనర్. ఇంతకీ ఈ ఖాకీలు ఇంత కర్కశంగా ఎందుకు మారారు? ఒక్కణ్ని పట్టుకుని రాక్షసుల్లా ఇలా ఎందుకు బరితెగించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందసలు..? బైక్ విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య బస్తీలో ఓ చిన్న గొడవ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో జిమ్ ట్రైనర్ ఆరోగ్యరాజ్ ఇంటికి వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్పారు చిలకల్‌గూడా పోలీసులు. పొద్దున్నే వస్తానని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన పోలీసులు పడేసి రోడ్డు మీదే అనఫీషియల్‌గా ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దాడి దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.
సికింద్రాబాద్ లాలాగూడ చెందిన సూర్య ఆరోగ్యరాజ్ జిమ్ నడుపుతున్నాడు. భార్య వారం రోజుల కిందట పుట్టింటికెళ్లడంతో మెట్టుగూడలోని తల్లి శీల ఇంట్లో ఉంటున్నాడు ఆరోగ్యరాజ్. ఈనెల 3న రాత్రి ఇంటి వద్ద బస్తీలో ఓ వ్యక్తికి ఇతనికి ఇద్దరి మధ్య బైకు విషయంపై గొడవ జరిగింది. అది పోలీసుల దాకా వెళ్లి… ఖాకీల చిత్రహింసలతో ఆరోగ్యరాజ్‌ని ఇలా ఆస్పత్రి పాలు చేసింది. విషయం తెలుసుకున్న బస్తీవాసులు సూర్య ఇంటికి చేరుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే అంబులెన్స్‌లో గాంధీ అప్పత్రిలో చేర్పించారు స్థానికులు. పోలీసులు దెబ్బలకు నిందితుడి ఎడమ కాలు విరిగిపోయినట్టు తేల్చేశారు గాంధీ వైద్యులు. మంగళవారం సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు.
తర్వాత బేరసారాలు చేసిన కానిస్టేబుళ్లు, మీమీద కేసులు పెట్టబోమని, ఆస్పత్రి ఖర్చులు తామే భరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.అటు… ఆ నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది బాధితుడి తల్లి శీల. హెచ్చార్సీని ఆశ్రయించే ఆలోచనలో కూడా ఉన్నారు బాధితులు. చిలకల్‌గూడ పోలీసులు చేసిన ఈ ఓవరాక్షన్‌తో తెలంగాణా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే కదలిక వచ్చేలా ఉంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి