Hyderabad: హైదరాబాద్‌లో వాల్ పెయింటింగ్స్ బ్యాన్.. ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు వాల్ రైటింగ్స్‌ను పూర్తిస్థాయిలో నిషేధం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ సర్కిలర్ జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సర్క్యులర్ విడుదల చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో వాల్ పెయింటింగ్స్ బ్యాన్.. ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి
GHMC Commissioner Amrapali
Follow us
Vidyasagar Gunti

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 28, 2024 | 6:38 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు, వాల్ రైటింగ్స్‌పై పూర్తిస్థాయిలో నిషేధం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సర్కులర్ విడుదల చేశారు. 2016లో గత ప్రభుత్వం ఏదైతే బ్యానర్లు వాల్ పెయింటింగ్స్‌పై నిషేధం ఇస్తూ తీసుకువచ్చినటువంటి సర్క్యులర్‌ను కఠినంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ జీహెచ్ఎంసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే నగరవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పోస్టర్స్ , అనధికారికంగా గోడల మీద రాత నిషేధిస్తూ చర్యలు తీసుకోవాలని డీసీలను బల్దియాను ఆదేశించింది. డిప్యూటీ కమిషనర్లు స్థానికంగా ఉన్న ప్రింటర్స్ యజమానుల తోటి సమావేశాలు నిర్వహించి దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఫిలిం థియేటర్ ఓనర్స్‌తో సైతం సమన్వయం చేసుకొని మూవీ పోస్టర్స్‌ను ఎక్కడపడితే అక్కడ అంటించకుండా చూడాలని, అనుమతి ఉన్నచోట మాత్రమే సినిమా ప్రమోషన్లు చేసుకునేలా థియేటర్ ఓనర్స్‌కు సైతం అవగాహన కల్పించాలన్నారు. వాల్స్ మీద ఎలాంటి మూవీ పోస్టర్లను అంటించవద్దంటూ సూచనలు చేయాలన్నారు. ఒకవేళ అనధికారికంగా పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ కనిపిస్తే వెంటనే  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్షన్ తీసుకోవాలని, వారికి జరిమానా విధిస్తూ వాటిని తొలగించాలంటూ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం 2016లో జీహెచ్ఎంసీలో తీసుకొచ్చిన సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేసేలా డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.

నగరంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్స్‌పై కూడా నిషేధం కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ అనుమతించిన డిజిటల్ బోర్డ్స్, వాల్ బోర్డ్స్‌లో మాత్రమే ఇప్పుడు ప్రకటనలు కనిపిస్తున్నాయి. గతంలోనే పెద్దపెద్ద హోర్డింగ్స్‌పై నిషేధం కొనసాగుతున్నప్పటికీ పలుచోట్ల అక్రమ హోర్డింగ్స్‌ వెలువెతున్నాయని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే హోర్డింగ్స్‌‌కి సంబంధించిన కేసు హైకోర్టులో ఉండడంతో నగరంలో పలు చోట్ల అస్థిపంజరాలను తలపిస్తూ హోర్డింగ్స్‌ కనబడుతుంటాయి.