Vitamin D: కరోనా చికిత్సలో ‘డీ’ విటమిన్ మాత్రలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? నిమ్స్ వైద్యుల అధ్యయనంలో కీలక అంశాలు
Vitamin D: కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనాను కట్టడికి రకరకాల చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కోవిడ్‌ను నయం చేసుకునేందుకు వ్యాక్సిన్స్, మందులు అందుబాటులోకి..
Vitamin D: కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనాను కట్టడికి రకరకాల చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కోవిడ్‌ను నయం చేసుకునేందుకు వ్యాక్సిన్స్, మందులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇమ్యూనిటీ లెవల్స్ పెంచుకుంటే కరోనాను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా చికిత్సలో భాగంగా రోగులకు డీ విటమిన్ మాత్రలను అందించడం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది..? ఇన్ఫెక్షన్ తీవ్రతను, మరణాల రేటును తగ్గించేందుకు ఉపయోగడనున్నాయా..? అనే అంశాలను తెలుసుకునేందుకు ‘పల్స్ డీ థెరపీ’ పేరిట హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 130 మంది కరోనా రోగులకు ఇతర ఔషధాలతో పాటు డీ విటమిన్ (60,000 ఐయూ) క్యాప్సూల్స్‌ను కూడా 8 నుంచి 10 రోజుల పాటు అందించారు.
శరీరంలో కనీసం 20 నుంచి 50 నానోగ్రామ్స్/మిల్లీలీటరు డీ విటమిన్ మోతాదు ఉండాల్సి ఉంటుంది. అధ్యయనం పూర్తయ్యే సమయానికి కరోనా రోగుల్లో ఈ మోతాదు గణనీయంగా పెరిగి సగటున 80 నుంచి 100 నానోగ్రామ్స్/మిల్లీలీటర్లకు చేరినట్లు పరిశోధనలలో గుర్తించారు.
తగ్గిన ఇన్ఫెక్షన్
ఆయా రోగుల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతను పెంచే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ల సంఖ్య భారీగా తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అలాగే రోగ నిరోధక కణాలు కరోనా వైర్‌స్కు వ్యతిరేకంగా యాంటీ మైక్రోబయల్ పెప్టైడ్‌ల ఉత్పత్తిని పెంచేందుకు డీ విటమిన్ ఎంతగా ఉపయోగపడిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడీషియన్ మహేశ్వర్ లక్కిరెడ్డి వెల్లడించారు. రోగ నిరోధక వ్యవస్థ అతి స్పందన కారణంగా కరోనా రోగుల్లో సంభవించే ‘సైటోకైన్ స్టార్మ్’ ముప్పును కూడా డీ విటమిన్ మాత్రలు తగ్గించాయన్నారు. 55 నానోగ్రామ్/మిల్లీలీటరు కంటే ఎక్కువ డీ విటమిన్ కలిగిన వారిలో 5 శాతం మందే కరోనా బారినపడుతున్నారని ఆయన అన్నారు. 60 నానోగ్రామ్/మిల్లీలీటరు లేదా అంతకుమించి డీ విటమిన్ కలిగిన కరోనా రోగుల మరణాలు దాదాపు లేనేలేవన్నారు. ఈ అధ్యయనం ‘నేచర్ డాట్‌కామ్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.