జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లకు పదవీగండం.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు..!

పాలకమండలి కొలువుదీరి అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ కొందరు కార్పొరేటర్లకు పదవీ గండం ఆందోళన పట్టుకుంది.

జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లకు పదవీగండం..  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 26, 2021 | 3:13 PM

GHMC corporators in a fix : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలువురు కొత్త కార్పొరేటర్లపై అనర్హత కత్తి వేలాడుతోంది. పాలకమండలి కొలువుదీరి అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ కొందరు కార్పొరేటర్లకు పదవీ గండం ఆందోళన పట్టుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి పోటీ చేసి గెలిచారన్నది వారిపై ఆరోణలు వచ్చాయి.

ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్నవారు పోటీకి అనర్హులు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే దుమారం రేగింది. ఘాన్సీబజార్‌ బీజేపీ అభ్యర్థి, గాజులరామారం కాంగ్రెస్‌ అభ్యర్థులపై ఇవే ఆరోపణలు రావడంతో.. వారి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పోటీ చేసినా ఓడిపోయారు. దీంతో అది ముగిసిన అధ్యాయంగా అంతా భావించారు. కానీ, గెలిచిన మరో కొందరు కార్పొరేటర్లపై ఇదే తరహా అభియోగాలు వచ్చాయి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యర్థులు కోర్టు మెట్లెక్కారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన 48 మందిలో కనీసం 25 మంది బీజేపీ కార్పొరేటర్లు అనర్హత ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువగా ఇద్దరు పిల్లల నిబంధనను ఉల్లంఘించడం, ఆస్తులు, క్రిమినల్ కేసులు, ఒకే వ్యక్తి నమోదు చేసిన డబుల్ ఓట్లపై సమాచారాన్ని దాచిపెట్టినట్టినటువంటి వివిధ కారణాలను చూపుతూ నగర సివిల్ కోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటిషన్ దాఖలు చేసినవారిలో ఎక్కువగా ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు కావడం విశేషం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒక టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ ఉన్నారు. జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేశ్, జాంబాగ్‌ కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌, హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత, కుత్బుల్లాపూర్‌ కార్పొరేటర్‌ పారిజాతం ఈ జాబితాలో ఉన్నారు. పారిజాతం మినహా మిగతా వారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ నలుగురికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించామని ప్రత్యర్థులు చెప్తున్నారు. వారు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్లపై మూడు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఎన్నికల ట్రైబ్యునళ్లను ధర్మాసనం ఆదేశించింది. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం, ఫలితాలను ప్రచురించిన తేదీ నుండి 45 రోజులలోపు ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలి. జీహెచ్‌ఎంసీ ఫలితాలను డిసెంబర్ 4 న ప్రకటించారు. కాగా ఇప్పుడు కేసులు వేయడం విశేషం.

గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే కోర్టుల్లో విచారణ సంవత్సరాల తరబడి సాగేది. ఈలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పదవీకాలం కూడా పూర్తయ్యేది. అయితే ఇప్పుడు హైకోర్టు మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. గెలిచిన కార్పొరేటర్లకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నట్లు రుజువైతే అనర్హత వేటు పడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమకు ఇద్దరు పిల్లలే ఉన్నారని అభ్యర్థులు అఫిడ్‌విట్‌ దాఖలు చేయడం ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

అయితే, బీ ఫారాలు ఇచ్చినప్పుడు పార్టీ నేతలు ఏం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నా.. అవన్నీ చెక్ చేసుకునే టైం లేదన్న రెడీమేడ్‌ ఆన్సర్లు పార్టీల దగ్గర ఉన్నాయి. తమ కార్పొరేటర్లు ఏం చెప్తారో విని కోర్టులో ఫైట్‌ చేస్తామని.. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటే.. రెండో స్థానంలో నిలిచినవారిని విజేతగా ప్రకటించకుండా, మళ్లీ ఎన్నికలకు వెళ్లేలా ఆదేశించాలని కోర్టును కోరతామని చెప్తున్నారు.

మరోవైపు, చిన్న చిన్న కారణాల ఆధారంగా తమ కార్పొరేటర్లపై టీఆర్ఎస్ అభ్యర్థులు 25 ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసినట్లు బీజెపీ లీగల్ సెల్ న్యాయవాది కె.ఆంథోనీ రెడ్డి చెప్పారు. ఎంఐఎం కార్పొరేటర్లపైన కూడా రెండు కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. అలాగే బీజేపీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్ కార్పొరేటర్లపైన కూడా పిటిషన్లు దాఖలు చేశారని ఆయన అన్నారు. కాగా, ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు అధికారిక యంత్రాలను దుర్వినియోగం చేశారని, గులాబీ పార్టీ కార్పొరేటర్ల డేటాను సేకరించి, గడువుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు పిటిషన్లు దాఖలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఇదే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సి.కళ్యాణ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లీగల్ సెల్ గానీ టీఆర్ఎస్ పార్టీ గానీ ఎటువంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. ఇది ఓడిపోయిన అభ్యర్థుల వ్యక్తిగత నిర్ణయం అన్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించి సుమారు 30 ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుసని ఆయన అంగీకరించారు.

గత జీహెచ్‌ఎంసి పాలక మండలిలో బీజెపీకి కేవలం నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 2020 ఎన్నికలలో దాని సంఖ్య 48 కి పెరిగింది. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే బీజేపీ కార్పొరేటర్లలో ఒకరు మరణించారు. దీంతో ప్రస్తుతం కౌన్సిల్‌లో ఆ పార్టీ బలం 47గా ఉంది. ఇక, ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు మాత్రం టెన్షన్‌లో ఉన్నారట. మరి.. కోర్టులు ఏం తేలుస్తాయో వేచి చూడాలి.

Read Also…  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతం.. ఇవాళ విశాఖ దిగ్బంధించిన అఖిలపక్షం