స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతం.. ఇవాళ విశాఖ దిగ్బంధించిన అఖిలపక్షం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరు... హోరెత్తుతోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతం.. ఇవాళ విశాఖ దిగ్బంధించిన అఖిలపక్షం
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 26, 2021 | 2:13 PM

Visakha blockade : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ తరగతుల ప్రజలు, కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు విక్రయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై లేఖ కూడా రాసింది. తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. మరోవైపు, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను మంత్రులు, అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. కేంద్రం వెంటనే ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తీవ్రరూపం దాల్చుతోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరు… హోరెత్తుతోంది. నేడు విశాఖ దిగ్బంధనానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు రాస్తారోకో నిర్వహించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితికి టీడీపీ, వామపక్షాలు మద్ధతు తెలిపాయి. కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు రాస్తారోకో చేయనున్నాయి. సంఘీభావంగా మద్దిలపాలెంలో వామపక్షాలు రాస్తారోకో చేపట్టనున్నాయి. భారత్‌ బంద్‌ ఉద్యమకారులు మద్దతు తెలిపారు. విశాఖ వ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి కార్మికులు, ప్రజాసంఘాలు ర్యాలీ తీశారు. గాజువాక తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగునుంది. గాజువాక యార్డులోనూ ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. స్లాగ్‌ అండ్‌ బల్క్ మెటీరియల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. గాజువాక లారీ యార్డు నుంచి డాక్‌ యార్డు వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి సీపీఐ మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి కైలాసం ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల విశాఖ ఉక్కులో కార్మికులు హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రైవేటుపరం చేయడం అసాధ్యమని లేఖలో తెలిపారు. ఉక్కు కార్మికులపై ప్రేమ, సానుభూతి ఉంటే జగన్‌ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలి’ అని కైలాసం డిమాండ్‌ చేశారు.

ఇదిలావుంటే, విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించటం లేదు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పదని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించినప్పటి పరిస్థితులు వేరు , ప్రస్తుత పరిస్థితులు వేరని మోదీ పేర్కొన్నారు. యాభై , అరవై ఏళ్ళ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్న మోదీ ప్రస్తుతం దేశం అవసరాలు కూడా మారుతూ వచ్చాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం కోసం నిధులు కేటాయిస్తూ పోతే దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, విశాఖ స్టీల్ ఫ్లాంట్ విక్రయానికి కేంద్రం వేగంగా అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా దీపం, ఉక్కుశాఖల ఆర్థిక సలహాదారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి తుహిన్‌కాంత్‌పాండే, ఉక్కుశాఖ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ త్రిపాఠీ, న్యాయశాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌ మెదిరట్టా, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్‌, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజేశ్‌వర్మ, వ్యయ కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ప్రభుత్వరంగ సంస్థల శాఖ కార్యదర్శి శైలేష్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పర్యవేక్షణ సలహాదారుల ఎంపికకు అవసరమైన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ తయారీని మొదలుపెట్టినట్లు సమాచారం.

కాగా, పర్యవేక్షణ సలహాదారుల ఎంపికకు కనీసం 2 నెలలు పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎంపికైన సలహాదారులు.. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కొనేందుకు ముందుకొచ్చే వారిని ‘ఆసక్తి వ్యక్తీకరణ’కు ఆహ్వానించే పత్రాన్ని తయారుచేస్తారు. కేబినెట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని ‘కేబినెట్‌ కోర్‌ గ్రూప్‌ ఆన్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌’ ఈ పత్రంపై ఆమోదముద్ర వేస్తుంది. తర్వాత దానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో కూడిన ప్రత్యామ్నాయ యంత్రాంగం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదిలావుంటే, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ఉక్కు స్థాయీసంఘం ఛైర్మన్‌ రాకేశ్‌సింగ్‌కు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యులు బి.వి.సత్యవతి, మోపిదేవి వెంకటరమణారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన స్థాయీసంఘం సమావేశంలో వారు ఆయనకు వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ మద్దతు పలికారు.

మరోవైపు, విశాఖ ఉక్కు కర్మాగార విక్రయ ఆలోచనను విరమించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. కర్మాగారం అమ్మకానికి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని ఖండించాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్‌), ఎంసీపీఐ(యు), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎస్‌యూసీఐ(సి), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిలుపుదలకు కృషి చేయాలని కోరాయి.

ఇదీ చదవండీ… కేంద్రం, బీసీ కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ