Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేసింగ్ అభిమానులకు షాక్.. ఫార్ములా ఈ రద్దు.. ఇంతకీ అసలేం జరిగింది

హైదరాబాద్ నగరంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ల రేస్‌‌ను నిర్వాహకులు రద్దు చేశారు. సీజన్ 10 లో భాగంగా ఫిబ్రవరి 10న 4వ రేసింగ్‌ జరగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్‌ శాఖకు నోటీసు ఇస్తామని వివరించారు. రేసు రద్దు కావడంపై ఫార్ములా-ఈ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో ఎక్స్ వేదికగా స్పందించారు.

రేసింగ్ అభిమానులకు షాక్.. ఫార్ములా ఈ రద్దు.. ఇంతకీ అసలేం జరిగింది
Formula E Race
Follow us
Vidyasagar Gunti

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 06, 2024 | 8:15 PM

హైదరాబాద్ లో ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్ రద్దు అయింది. ఫిబ్రవరి 10 నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ రద్ద చేస్తున్నట్లు ఎఫ్ఐఏ అధికారులు ప్రకటించారు. హుస్సేన్ సాగర తీరాన స్ట్రీట్ సర్క్యూట్ పై జరగాల్సిన ఈ ఈవెంట్ రద్దు చేసుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గత ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లఘించిందని ఈ నేపథ్యంలో MAUD సంస్థ కు నోటీసులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ల రేస్‌‌ను నిర్వాహకులు రద్దు చేశారు. సీజన్ 10 లో భాగంగా ఫిబ్రవరి 10న 4వ రేసింగ్‌ జరగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్‌ శాఖకు నోటీసు ఇస్తామని వివరించారు. రేసు రద్దు కావడంపై ఫార్ములా-ఈ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో ఎక్స్ వేదికగా స్పందించారు. తాము చాలా అసంతృప్తికి గురవుతున్నామని చెప్పారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారని… రేసు రద్దు కావడం బాధాకరమని ఆయన అన్నారు.

ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో గతేడాది ఫార్ములా ఈ-ప్రిక్స్‌ కార్‌ రేస్‌ నిర్వహణకు సీజన్ 10కి గాను క్యాలెండర్‌ ప్రకటించింది. రేస్‌ల నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. వాటిలో తొలిసారిగా భారత్‌ను ఎంపిక చేసి హైదరాబాద్‌ను వేదికగా చేశారు. దేశంలో రెండోసారి ఫార్ములా ఈ- రేస్‌ కావడంతో ప్రమోటర్‌గా ముందుకొచ్చిన గ్రీన్‌కో సంస్థతో అప్పటి ప్రభుత్వం తో 2023 అక్టోబర్ 10న ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌ నడిబొడ్డున 2022 నవంబర్ లో హుస్సేన్‌సాగర్‌ తీరాన గల ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూరా ఏడు మలుపులతో 2.75 కి.మీ వచ్చేవిధంగా సర్య్కూట్‌ ట్రాక్‌ను డిజైన్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టింది.

దేశంలోనే తొలిసారి ఫార్ములా ఈ రేస్ కి 2023 లో హైదరాబాద్ వేదికైంది. కార్‌ రేస్‌కు ప్రమోటర్‌గా ఉన్న గ్రీన్‌కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో నిర్వహణ వ్యయాన్ని ఆ సంస్థ నే భరించింది. కేవలం ట్రాక్‌ ఏర్పాట్లను మాత్రమే హెచ్‌ఎండీఏ చేపట్టింది. అయితే, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా రేస్‌ నిర్వహణ తర్వాత 84 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, ట్రాక్‌ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.5 కోట్లను హెచ్‌ఎండీఏ వెచ్చించింది. అయితే ఈసారి కార్‌ రేసింగ్‌ నిర్వహణకు ఏ సంస్థా ముందుకు రాలేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కార్‌ రేస్‌ ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్‌, క్యాంపెయిన్‌, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు వసతుల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. అందుకే రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రానట్లు సమాచారం.

హుస్సేన్‌సాగర్‌ తీరాన గల స్ర్టీట్‌ సర్క్యూట్‌లో గత నవంబర్‌ 4, 5 తేదీల్లో ఇండియన్‌ రేస్‌ లీగ్‌ జరగాల్సి ఉండగా ఎన్నికల వేళ సహకారం అందించలేమని ప్రభుత్వ యంత్రాంగం చెప్పింది. దాంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్‌ రేస్‌ లీగ్‌ను రద్దు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా, ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ పోటీలకు సైతం తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటం తో వేరే దేశాల్లో నిర్వహించనున్నారు. అయితే గతంలోనే ఒప్పదం చేసుకున్న ఈవెంట్ కు అనుమతి ఇవ్వకపోవటం తో మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

అయితే ఫార్ములా – ఈ రేస్ రద్దు కావటం పై brs వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ధ్వజమెత్తారు. ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు మన నగరం, దేశ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుతాయన్నారు. హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి EV ఔత్సాహికులు, తయారీదారులు మరియు స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు EV సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా E రేస్‌ను ఒక సందర్భంగా ఉపయోగించుకుందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈవెంట్ ను రద్దు చేసుకోవటం సరైన చర్య కాదన్నారు కేటీఆర్. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ చూడాలనుకున్న హైదరాబాది లు నిరాశ చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…