Danam: పంజాబ్‌లో ప్రధాని మోడీకి పట్టిన గతే.. తెలంగాణలో బీజేపీ నేతలకు పడుతుంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నాయకులు విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
MLA Danam Nagendar fire on BJP: ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నాయకులు విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పంజాబ్‌లో ప్రధాని మోడీకి ఏ గతిపట్టిందో తెలంగాణలో బీజేపీ నేతలకు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని దానం నాగేందర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ బురదలో కూరుకుపోయిందన్న ఆయన.. ఆ బురదలో రాయి వేసి బురదమయం కాలేమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దానం అందజేశారు. ఈ సందర్భంగా.. దానం నాగేందర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతల తీరుపై ఘాటుగా విమర్శించారు.
రాష్ట్ర నేతలు అవగాహన లేకుండా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అపహాస్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్‌లో చెత్త ఉందని మాట్లాడుతున్న విజయశాంతి.. దిల్లీ నుంచే చెత్త వస్తుందని గమనించాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక వ్యక్తి కాదని తెలంగాణ శక్తి అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు ప్రవర్తన మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని దానం హెచ్చరించారు.