Hyderabad: పల్లె బాట పడుతోన్న పట్నం.. రద్దీగా మారిన బస్టాండ్ లు.. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్ లు..
నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగలతో నగరం క్రమంగా పల్లె బాట పడుతోంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా..
నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగలతో నగరం క్రమంగా పల్లె బాట పడుతోంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్‌లు, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్లలో రష్ అధికంగా ఉంది. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్‌లలో రద్దీ అధికంగా పెరిగింది. అయితే.. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ చార్జీలే వసూలు చేయనున్నామనే ప్రకటనతో స్వస్థలాలకు వెళ్లే వారు బస్సులనే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దోపిడీ కొనసాగుతోంది. మరోవైపు.. దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లనూ ఏర్పాటు చేసింది. తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన చెందుతున్నారు.
పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 4,400కు పైగా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన రైళ్లు అవసరాలు తీర్చడం లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌బీనగర్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట.. ఎంజీబీఎస్ నుంచి మహబూబ్‌నగర్, వికారాబాద్, తాండూరు, భద్రాచలం.. ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట.. జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్.. సీబీఎస్ నుంచి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు బయల్దేరతాయి. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణ సమయంలోనూ టిక్కెట్‌లు తీసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం