Telangana: నీటి కుంటలో మునిగి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి మరొకరు..
స్కూల్స్ కు సెలవులు వచ్చేశాయి. దసరా పండుగ సమీపిస్తోంది. ఇదే సమయంలో కుంటలు, చెరువులు నీటితో నిండి, నిండుకుండలా మారాయి. ఇంటి పట్టున ఉండే పిల్లలు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా..
స్కూల్స్ కు సెలవులు వచ్చేశాయి. దసరా పండుగ సమీపిస్తోంది. ఇదే సమయంలో కుంటలు, చెరువులు నీటితో నిండి, నిండుకుండలా మారాయి. ఇంటి పట్టున ఉండే పిల్లలు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు కన్నీటిని మిగుల్చుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సరదాగా నీటిలోకి దిగిన చిన్నారులు.. పెద్ద పెద్ద గుంతల్లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇలా నలుగురూ మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం గొల్లగూడ గ్రామంలో ఎండీ కాశీం, బీబీ జానీ దంపతులు నివాసముంటున్నారు. వారికి కుమారుడు కహ్లీద్, కూతురు సమ్రీన్ ఉన్నారు. కాశీం సోదరుడి కుమారుడు రెహాన్, మరో బాలుడు ఇమ్రాన్‌లు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చే సమయంలో కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్ ముందుగా బయలుదేరారు. ఎర్రకుంట వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.
భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీనిని గమనించని చిన్నారులు సరదాగా చెరువులోకి దిగారు. పెద్ద గుంతలో చిక్కుకున్న ఓ బాలుడు మునిగిపోతుండగా మిగతావారు గమనించారు. గట్టిగా కేకలు వేస్తూ అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు వెళ్లి నలుగురూ మునిగి పోయారు. వీరి అరుపులు విన్న సమీపంలోని రైతులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే సరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు నలుగురు పిల్లలు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగత జీవులుగా చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికారులకు వివరిస్తామని, ఆందోళన విరమించాలని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..