AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలోని ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరా.. జలమండలి కీలక నిర్ణయం.

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ - బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను...

Hyderabad: నగరంలోని ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరా.. జలమండలి కీలక నిర్ణయం.
Water Board
Narender Vaitla
|

Updated on: Mar 04, 2023 | 7:44 PM

Share

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను జలమండలి ఎండీ దానకిశోర్ శనివారం పరిశీలించారు. నూతన రైల్వే ట్రాక్ కు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జ్ ఓవర్, పైపు లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకు ముందు అనుకున్న సమయం 66 గంటల కంటే ముందే 48 గంటల్లో పనులు పూర్తి చేయాలన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. భారీ పైపు లైన్ కావడంతో పనులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా వెల్డింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇదిలా ఉంటే మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు దక్షిణ మధ్య రైల్వే నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్ కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపు లైన్ ఉంది. ట్రాక్ క్రాసింగ్ కోసం ఆ పైపు లైన్ కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ అధికారులను అలర్ట్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న టీమ్‌ల కంటే రెట్టింపు మందితో పని చేయాలని తెలిపారు. అవసరమైతే తగిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలని సూచించారు. కావాల్సిన యంత్రాలు, పనిముట్లు, నిర్మాణ సామగ్రిని అదనంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పనులు జరుగుతన్న ప్రాంతంలో అవసరమైన రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పని చేసే సమయంలో రక్షణ చర్యలు పాటించాలన్నారు. దీంతో పాటు ఈ ప్రాంతమంతా సరైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అనధికార వ్యక్తులను అనుమతించవద్దని సూచించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారలను ఆదేశించారు.

Water Board

ఇవి కూడా చదవండి

ఆ ప్రాంతాల్లో ఉచితంగా నీరు..

అనంతరం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎంలతో ఎండీ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా 66 గంటలు పనులు జరుగుతాయనుకున్నప్పటికీ.. వాటిని 48 గంటల్లో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావితమయ్యే ప్రాంతాల్లో 10 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అప్పటి వరకు వాటికి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని పేర్కొన్నారు. మరమ్మతు పనుల వల్ల నగరంలో దాదాపు 2.5 లక్షల కనెక్షన్లకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతందన్నారు. ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలన్నారు. అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సూచించారు. ప్రభావితమయ్యే ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులకు సైతం ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పనులు మొదలు పెట్టక ముందే నగరంలోని అన్ని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Hyderabad

అంతేకాకుండా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నీటి సరఫరా అంతరాయం సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు. లైన్ మెన్లు, మీటర్ రీడర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు విషయం తెలియజేయాలన్నారు. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మేల్యేలతో మాట్లాడి వారితో సమావేశాలు నిర్వహించి నీటిని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకోవాలని, ప్రజలందరూ ఈ సమయంలో నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..