Hyderabad: గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గాయి.. సైబరాబాద్ క్రైమ్ రిపోర్ట్ – 2022ను వెల్లడించిన సీపీ..
గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది 12శాతం వరకు ఉన్నట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే నేరాలు తగ్గాయని...
గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది 12శాతం వరకు ఉన్నట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే నేరాలు తగ్గాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ జరిగినప్పటికీ.. సైబరాబాద్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు మూడు సార్లు ప్రధాని పర్యటన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. సైబరాబాద్ పోలీసులు సమర్థంగా పని చేసి, ఎక్కడా సమస్యలు రానివ్వలేదన్నారు. కమిషనరేట్ పరిధిలో లో అన్ని పండుగలు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగాయని చెప్పారు. 2010 నుంచి పెండింగ్ లో ఉన్న 80 శాతం కేసుల దర్యాప్తు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 27,322 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని వివరించారు.
57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది పై రౌడీషీట్ ఓపెన్ చేశాం. సైబరాబాద్ డయల్ 100 కు ఈ ఏడాది 2 లక్షల 36 వేల 417 కాల్స్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 49% కాల్స్ పెరిగాయి. ఈ ఏడాది 93 హత్య కేసులు, 316 లైంగిక దాడి కేసులు జరిగాయి. మహిళలపై నేరాల అంశంలో 2,166 కేసులు వచ్చాయి. 15 వరకట్నం హత్య కేసులు వచ్చాయి. 1,096 వరకట్నపు వేధింపుల కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య ఎనిమిది శాతం తగ్గింది. 328 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
– స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
మరోవైపు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్ రివ్యూను వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,060 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని, కానీ ఇంత ప్రశాంతంగా ముగుస్తుందని అనుకోలేదని అన్నారు. బోనాలు పండుగ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్, మిల్ద్ ఉన్ నబి ఇలాంటి తదితర పండుగలకు ఎక్కువ సంఖ్యలో జనాలు హాజరయ్యారని వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..