ఆర్టీసీ లాభాల కోసం.. కేసీఆర్ మరో కీలక నిర్ణయం
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని బలంగా నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్‌ను విస్తృత పరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కార్గో సేవలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు డిపోల నుంచి బ్రాందీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి సరుకు రవాణా ఇకపై […]

ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని బలంగా నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్‌ను విస్తృత పరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కార్గో సేవలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు డిపోల నుంచి బ్రాందీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేటట్లు చూస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇప్పటికీ సరుకులను రవాణా చేయడానికి ప్రైవేట్ ట్రాన్సుపోర్టును ఉపయోగిస్తున్నారని, ఇకపై ఆర్టీసీల్లో సేవల్లోనే చేసేలా ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే కేవలం రాష్ట్ర పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే మంబయి, బీవండి, సోలాపూర్, నాగపూర్, జగ్దల్ పూర్ తదితర ప్రాంతాలకు కూడా సరుకు రవాణా చేయాలని ఆయన తెలిపారు. సరుకు రవాణా ఎక్కువ చేయగలిగితే.. ఆర్టీసీకి కూడా లాభాలు వస్తాయని కేసీఆర్ వెల్లడించారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ బోర్డులో ప్రతి డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు ఉండనున్నారు. మొత్తం 202 మంది ఈ బోర్డులో సభ్యులుగా ఉండనుండగా.. ఇందులో 95మంది బీసీ, 38మంది ఎస్సీ, 26మంది ఎస్టీ, 44మంది ఓసీలకు స్థానం కల్పించనున్నారు. అలాగే వీరిలో 73మంది మహిళలు ఉండాలని ఆయన సూచించారు. ఇక ఆర్టీసీని కాపాడేందుకు ఉద్యోగులు తగిన స్ఫూర్తి, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించాలని కేసీఆర్ కోరారు.



