అమ్మాయి పేరుతో ఇన్‌స్టాగ్రాంలో వల.. ఇంటర్‌ విద్యార్థినికి నరకం.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా కొందరిని నమ్మించి మోసగిస్తున్నారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగిందనో.. అనారోగ్యం కారణంగా ఆపరేషన్‌ కోసం ఆర్థికంగా..

అమ్మాయి పేరుతో ఇన్‌స్టాగ్రాంలో వల.. ఇంటర్‌ విద్యార్థినికి నరకం.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా కొందరిని నమ్మించి మోసగిస్తున్నారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగిందనో.. అనారోగ్యం కారణంగా ఆపరేషన్‌ కోసం ఆర్థికంగా ఆదుకోవాలనో రకరకాలుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులు వసూలు చేయడమే కాదు.. అమ్మాయిలను సైతం మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  తాజాగా ఓ వ్యక్తి అమ్మాయిలా నటించి ఇన్‌స్టాగ్రాంలో వల విసిరాడు. రోడ్డు ప్రమాదానికి గురయ్యానని డబ్బులు వసూలు చేశాడు. తిరిగి ఇవ్వమంటే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. చివరకు వ్యక్తిగత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ ఇంటర్మీడియట్‌ విద్యార్థిని(18)కి చుక్కలు చూపించాడు. దీంతో ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మా అన్నయ్యతో మాట్లాడవచ్చుగా..

కాగా, బాధితురాలికి ఇన్‌స్టాగ్రాంలో ప్రియా అనే ఓ ఐడీ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఆమె యాక్సెప్ట్‌ చేసింది. తరచూ ఛాటింగ్‌ చేసేవాళ్లు. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. తనకు సాయి అనే సోదరుడు ఉన్నాడని ప్రియ బాధితురాలికి చెప్పింది. తనతో మాట్లాడమని కోరింది. బాధితురాలు అంగీకరించడంతో అతని నెంబర్‌ ఇచ్చింది. అప్పుడు బాధితురాలు వాట్సాప్‌లో ‘హాయ్‌’ అంటూ మెసేజ్‌ చేసింది. అప్పుడు సాయి తన వ్యక్తిగత వివరాలు, కుటుంబం, ఇతరత్రా విషయాల గురించి తెలియజేశాడు. కొన్ని రోజుల్లోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది.

రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ నమ్మబలికి..

ఒక రోజు సాయి.. బాధితురాలికి తాను రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ మెసేజ్‌ చేశాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే ఈ ఘటన జరిగిందంటూ తెలిపాడు. అత్యవసరంగా రూ.5 వేలు కావాలని అడిగాడు. నిజమేననుకుని సదరు బాధితురాలు తన తల్లి దగ్గర డబ్బు తీసుకుని గత నెల 23న ఫోన్‌పేలో పంపించింది. మరుసటి రోజు, ఆ తర్వాత రెండు దఫాలుగా మరో రూ.4 వేలు తీసుకున్నాడు. మొత్తం రూ.9 వేలు రెండు రోజులలో తిరిగి ఇస్తానంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత డబ్బు అడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వ్యక్తిగత ఫోటోలు పంపించాలని అడిగితే ఆమె తిరస్కరించింది.

అభ్యంతరకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఫోటోలు పంపించింది. మళ్లీ డబ్బు ఇవ్వకపోతే వ్యక్తిగత వివరాలతో పాటు ఫోటోలను సైతంఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌ పెడతానంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రియా అనే పేరుతో నిందితుడే ఛాటింగ్‌ చేశాడని పోలీసులు ప్రాథమికంగదా నిర్ధారించారు. అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

కాగా, ఇలా అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్‌ మీడియా ద్వారా ఎన్నో జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా మంది మోసపోయారని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో మెసేజ్‌లు చేయవద్దని, లేకపోతే ఇలాంటి ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Crime News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. మరో ముగ్గురి పరిస్థితి..

Bank Robbery: మిడ్‌నైట్‌లో బ్యాంక్ చోరీకి ప్లాన్.. విఫలమైన భార్యా భర్తలు.. అసలేం జరిగిందంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu