Telangana: సర్వం సిద్ధం.. అమరవీరుల కుటుంబాలకు 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ

ప్రమాణస్వీకారానికి ఎల్‌బీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో ప్రధాన వేదికకు రెండు వైపులా రెండు ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించారు. వారి కోసం 300 సీట్లతో ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మేధావులు, ఉద్యమకారులు కూర్చునేందుకు మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Telangana: సర్వం సిద్ధం.. అమరవీరుల కుటుంబాలకు 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ
Lb Stadium
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 07, 2023 | 12:57 PM

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న వేళ హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు అందరూ తరలివస్తుండటంతో స్టేడియంలోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు స్టేడియంకు చేరుకోవడం మొదలుపెట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులను అలరించేందుకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణస్వీకారానికి ఎల్‌బీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో ప్రధాన వేదికకు రెండు వైపులా రెండు ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించారు. వారి కోసం 300 సీట్లతో ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మేధావులు, ఉద్యమకారులు కూర్చునేందుకు మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే స్టేడియంలో 30 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అందరికీ వేడుక కనిపించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు కూడా అమర్చారు. సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ కృతజ్ఞత సభ ఏర్పాటు చేసింది. దాదాపు లక్ష మంది వరకు ఈ సభకు హాజరవుతారని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టేడియం ప్రాంగణం, చుట్టుపక్కలా దాదాపు మూడు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరో వైపు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఉదయం పది గంటలకే హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి రేవంత్‌ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఈ ముగ్గురు నేతలు హైదరాబాద్‌లో హోటల్‌ తాజ్‌ కృష్ణకు చేరుకున్నారు. మరికాసేపట్లో వీరంతా హోటల్‌ నుంచి ప్రమాణస్వీకారం జరిగే ఎల్‌.బి.స్టేడియం చేరుకోనున్నారు. ఈ ముగ్గురి కోసం జామర్లతో కూడిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను పోలీసులు ఏర్పాటు చేశారు.

ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎల్‌.బి.స్టేడియం వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వారంతా హోటల్‌ నుంచి నేరుగా స్టేడియంకు చేరుకుంటారు. రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన కూడళ్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అటు మల్లికార్జున ఖర్గే, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక సీఎంలకు స్వాగతం పలికేందుకు రేవంత్‌ రెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దిగువన వీక్షించండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…