Agnipath protests-Hyderabad: మంటల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. పోలీసుల ఫైరింగ్.. ఒకరు మృతి
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన సెగ ఇవాళ హైదరాబాద్‌ను తాకింది.
త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం రక్షణశాఖ చేపట్టిన అగ్నిపథ్ నియామకాలపై నిరసనలు దేశవ్యాప్తంగా భగ్గుమన్నాయి. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్ అవుతున్న పలువురు యువకులు మండిపడుతున్నారు. బీహార్‌లో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ , బీహార్ , పంజాబ్ , హర్యానా రాష్ట్రాల్లో హింస చెలరేగింది. తాజాగా ఈ ఆందోళన తెలంగాణకు చేరుకుంది. ఊహించని విధంగా భారీ ఎత్తున ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరకున్నారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి… నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను రద్దు చేసి… యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్ల రువ్వడంతో.. వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని పలువురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.