Hyderabad: జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు.. స్పందించిన మురళి మోహన్

హైడ్రా వస్తోంది జాగ్రత్త..! చిన్న బిల్డరా.. పెద్ద బిల్డరా తేడా లేదు..! చెరువులు, కుంటల పరిధిలో ఆక్రమణలు ఉంటే నోటీసులు ఇవ్వడం.. కూల్చేయడం..! ఇప్పుడిదే జరుగుతోంది. తాజాగా జయభేరికీ హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయ్‌.. మీ వెంచర్‌లో ఆక్రమణలున్నాయ్‌.. 15 రోజుల్లో మీరే తొలగిస్తారా.. లేక మేమొచ్చి కూల్చాలా అని హైడ్రా ప్రశ్నించింది. ఈ నోటీసులపై టీవీ9తో మాట్లాడి వివరణ ఇచ్చారు మురళీమోహన్.

Hyderabad: జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు.. స్పందించిన మురళి మోహన్
Murali Mohan
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 08, 2024 | 10:36 AM

కన్‌స్ట్రక్షన్‌ రంగంలో టాప్‌ 10లో ఉండే సంస్థ జయభేరి. మాజీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్‌కు చెందిన ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లోకొచ్చింది.  హైడ్రా తమకు నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు మురళీమోహన్. ఐతే.. జయభేరి ఎక్కడా ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్‌కి వచ్చారని బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించారని టీవీ9తో చెప్పారు.  గచ్చిబౌలి రంగలాల్‌కుంట చెరువు బఫర్‌ జోన్‌లోకి ఈ షెడ్‌ వస్తుందని చెప్పారన్నారు. ఆ షెడ్‌ తామే తొలగించేస్తున్నామని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.  తాను 33 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్నానని, ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అన్నారు. తమకు 15 రోజుల సమయం ఇచ్చినా.. మంగళవారం సాయంత్రంలోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామని టీవీ9కి చెప్పారు.

జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిందనే విషయం 2 రోజులుగా సంచలనం అయ్యింది. ఎంతో పేరున్న సంస్థ కూడా నిబంధనలు ఉల్లంఘించిందనే విషయం బయటకు రావడం.. నోటీసులు ఇచ్చిన విషయం తెలియడంతో అసలేం జరిగిందనే చర్చ మొదలైంది. గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్‌కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించే యాక్షన్ ప్లాన్‌లో భాగంగా FTL, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జయభేరికి చెందిన నిర్మాణాలున్న చోట.. 3 అడుగుల మేర రేకుల షెడ్‌ పరిధి దాటి నిర్మించినట్టు గుర్తించారు. దాన్ని తొలగించేందుకు 15 రోజులు టైమిచ్చింది హైడ్రా.. లేదంటే తామే కూల్చేస్తామని జయభేరి సంస్థకు నోటీసులు పంపింది. రంగలాల్‌కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకి ఫిర్యాదులు వెళ్లాయి.  ఈ నేపథ్యంలో చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు జయభేరికి ఇచ్చిన నోటీసులపై మురళీ మోహన్‌ స్పందించారు.  ఆ షెడ్‌ను తామే కూల్చేస్తున్నట్టు టీవీ9తో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.