Hyderabad: తన ఇంటి ముందు వరద నిలవకుండా గోడ కట్టాడు.. ఆ తర్వాత సీన్ చిరిగి సితారయ్యింది..
వరదనీరు ఇంటి ముందు నిలవకుండా ఓ గోడ ఏర్పాటు చేశాడు. కట్టినప్పుడు స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు వర్షాలు పడటంతో.. ఆ వరద అంతా వారి ఇళ్లవైపు మళ్లింది. దీంతో వివాదం చెలరేగింది.
హైదరాబాద్, జులై 21: మామూలుగా కాలనీలు, గల్లీల్లో ఉండేవాళ్లు అందరూ కలిసి కట్టుగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినా.. ఆపద కలిగినా అందరూ కలిసి సాల్వ్ చేసుకుంటారు. కానీ నగరం లోని ఆ ప్రాంతంలో వచ్చిన సమస్య కారణంగా.. ఒక కాలనీలోని వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… నగరంలోని జలపల్లి మున్సిపాలిటీ పరిధి నబిల్ కాలనీలో చిన్నపాటి వర్షం పడినా చాలు నీరు ఆగిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో అదే కాలనీలో నివాసం ఉండే వ్యక్తి.. వరద తన ఇంటివైపు రాకుండా కొంతకాలం క్రితం కాలనీలో ఒక చోట గోడ నిర్మించాడు. కాగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో అదే ప్రాంతంలో నివశించే మరికొందరు ఒక సమూహంలా ఏర్పడి ఆ గోడను కూల్చేశారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. ఘర్షణ చెలరేగి కొట్టుకునే వరకు వెళ్లింది.
ఒకరిపై ఒకరు బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కంప్లైంట్ స్వీకరించిన బాలాపూర్ పోలీసులు వరద నీరు గురించి గొడవ పడ్డారా..? పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కాలనీలో ఉండే నలుగురు పెద్దలు కూర్చుని.. మాట్లాడితే సమసిపోయే సమస్యను.. ఇంత దూరం తీసుకువచ్చినందుకు వారిని అందరూ తిట్టి పోస్తున్నారు. వరదతో ఇబ్బంది ఉంటే.. అధికారులు ఫిర్యాదు చేయాలి తప్ప.. పిచ్చిపచ్చిగా నిర్మాణాలు చేయడం కూడా కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..