Hyderabad: బాబోయ్ గేదెలకు కూడా డ్రగ్స్ ఇస్తున్నారు.. ఎందుకో తెలిస్తే అవాక్కే
తొటి మనుషుల గురించే ఆలోచించేవారు ఈ సమాజంలో కరువయ్యారు. ఇక పశువుల గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. గేదెల నుంచి పాల ఉత్పత్తి పెంచేందుకు ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం పదండి.

తెలంగాణ, జులై 26: ఇన్నాళ్లు మనం కెమికల్స్ కలిపి తయారు చేసే కల్తీ పాల గురించి విన్నాం. పాలల్లో నీళ్లు కలిపే మాయగాళ్లను కూడా చూశాం. కానీ ఇక్కడ మహా దారుణం. గేదెలు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు వాటికి ఆక్సిటోసిన్ డ్రగ్ ఇస్తున్నారు. పక్కా సమాచారం మేరకు రాజేంద్రనగర్ SOT పోలీసుల మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి రోషన్ కాలనీలోని జాఫర్ డైరీ ఫామ్ డైరీ ఫామ్‌లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడ 48 ఆక్సిటోషిన్ డ్రగ్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 7 నెలల నుంచి 3 ఏళ్ల మధ్య పిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అందించే 200 కిలోల బాలామృతం కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పిల్లల కోసం ఉచితంగా ఈ బాలామృతం ఇంత పెద్ద మోతాదులో వీరి వద్దకు ఎలా వచ్చిందోనని అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ పిండిని సైతం పశువులకు దాణాగా వేస్తున్నట్లు గుర్తించారు.
గేదెలు అధికంగా పాలు ఇచ్చేందుకు అక్రమంగా కొందరు ఆక్సిటోసిన్ డ్రగ్స్ వినియోగిస్తారు. కానీ ఇలా చెయ్యడం వల్ల అటు పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పాలు తాగినవారిని కూడా అనారోగ్యం చుట్టుముడుతుంది. అందుకే ఈ డ్రగ్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా అక్రమంగా కొందరు ఈ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..