Weather Alert: ప్రజలకు హెచ్చరిక.. రాబోయే నాలుగు రోజులు చుక్కలే.. ఆ నగరాలకు ‘ఎల్లో’ అలర్ట్..
హైదరాబాద్ వాసులను ఇన్ని రోజులు వర్షాలు వణికిస్తే.. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రానున్న నాలుగు రోజులు చలి చుక్కలు చూపించనుందట. ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

హైదరాబాద్ వాసులను ఇన్ని రోజులు వర్షాలు వణికిస్తే.. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రానున్న నాలుగు రోజులు చలి చుక్కలు చూపించనుందట. ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది. ఇక ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. నగరంలో గత 24 గంటల్లో కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సీజిన్ సగటు కంటే 5 డిగ్రీలు కనిష్టం అన్నమాట. దీన్నిబట్టి రాబోయే నాలుగు రోజులు చలి తీవ్రంగా మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ ఐఎండీ ప్రకారం.. నగరంలోని ఏడు జోన్‌లు చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగం పల్లిలో జనవరి 10వ తేదీ వరకు ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కమ్మేస్తుంది. గత కొన్ని రోజులుగా నగరంలో చలి తీవ్రత లేనప్పటికీ.. ఇప్పుడు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక శుక్రవారం నాడు నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం 11 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలిగాలులు వీచాయి.
కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో.. నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేశారు. గుండె జబ్బు బాధితులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళలలో బయటకు రావొద్దని, పిల్లలకు స్వెట్టర్లు, వెచ్చని దుస్తులను వేయాలని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.




మరోవైపు ఉత్తర భారతదేశాన్ని చలి పులి వణికిస్తోంది. అనేక రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. చలి గాలుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చేవారం మొదటి అర్థభాగంలో పంజాబ్, హర్యానా, యూపీ సహా అనేక ప్రాంతాలలో తీవ్రమైన చలి ఉంటుందన్నారు. తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందన్నారు. ఇక బీహార్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంటుందన్నారు.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




