Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కుంగిపోతోన్న భూమి.. ఇళ్లకు బీటలు.. భయంతో వలసపోతున్న కుటుంబాలు..

జోషి మఠ్‌లో ఎక్కడ పడితే నీళ్ళు ఉబికి వస్తున్నాయి. రోడ్లపైనే హఠాత్తుగా భూమిలో నుంచి మురికి నీరు బయటకు పొంగిపొర్లుతుండడంతో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.

Viral: కుంగిపోతోన్న భూమి.. ఇళ్లకు బీటలు.. భయంతో వలసపోతున్న కుటుంబాలు..
Joshimath Cracks
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2023 | 2:57 PM

ఉత్తరాఖండ్‌లోని… జోషి మఠ్‌లో అనూహ్య ఘటనలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. జోషిమఠ్‌లో ఉన్నట్టుండి భూమి కుంగిపోతోన్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉన్నఫళంగా ఇళ్ళకు పగుళ్ళు ఏర్పడుతుండడం జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి జనం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భూకంపాలకు నెలవైన ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది…దీన్ని ప్రతిఘటిస్తోన్న జనం రోడ్డెక్కారు….ఇదే ఇప్పుడు ఉత్తరాఖండ పర్వత ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తోన్న ప్రధానమైన ఇష్యూ.  ఒకటి కాదు రెండు కాదు….గత కొద్దిరోజులుగా జోషిమఠ్‌ ప్రాంతంలోని వందల ఇళ్ళకు పగుళ్ళు ఏర్పడడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హఠాత్తుగా కుంగుతోన్న భూమి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. భయంకరమైన చలిలో బయటకు పరుగులు పెడుతున్నారు జనం. మరోవైపు రోడ్లపైనా ఇవే పగుళ్ళు హడలెత్తిస్తున్నాయి.

దీనికి తోడు జోషి మఠ్‌లో ఎక్కడ పడితే నీళ్ళు ఉబికి వస్తున్నాయి. రోడ్లపైనే హఠాత్తుగా భూమిలో నుంచి మురికి నీరు బయటకు పొంగిపొర్లుతుండడంతో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు కుంగుతోన్న ఇళ్ళు….గోడలపై హఠాత్తుగా పగుళ్ళు…. ఈ అనూహ్య పరిణామాలతో జనజీవనం కష్టతరంగా మారింది. పిల్లాపాపలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రినాథ్‌, హేమ్‌కుంద్‌ సాహిబ్‌ మార్గంలోని జోషిమఠ్‌ గ్రామం హైరిస్క్‌ జోన్‌లోకి వెళ్ళింది. గ్రామంలోని మొత్తం 3000 మంది ప్రభావితమయ్యారు. దీంతో మొత్తం గ్రామాన్నే ఖాళీ చేయించేపనిలో పడ్డారు అధికారులు. ఇప్పటివరకూ అనేక మందిని అక్కడి నుంచి ఇళ్ళు ఖాళీ చేయించారు. ఈ ప్రాంతం నుంచి ఖాళీచేయించి గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన తమను ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళమనడం అన్యాయం అంటూ ఆందోళనకు దిగారు జోషిమఠ్‌ వాసులు. రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. భద్రినాథ్‌ రోడ్డుని బ్లాక్‌ చేశారు. తాము ఆ గ్రామాన్ని ఖాళీ చేసేది లేదంటూ తెగేసి చెపుతున్నారు తరతరాలుగా అక్కడే బతుకుతోన్న జనం. మరోవైపు పర్వత ప్రాంతంలోని జోషిమఠ్‌ గ్రామంలో ఎక్కడికక్కడ కుంగుతున్న భూమికి కారణాలేంటో పరిశోధించేందుకు భూగర్భ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. అక్కడి పరిస్థితితులను పరిశీలిస్తున్నారు. జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఐఐటి రూర్కీ ప్రతినిధుల బృందం ఆ పర్వత ప్రాంత గ్రామంలో పరిశోధనలు చేస్తోంది.

అయితే అసలు జోషి మఠ్‌ గ్రామమే ఓ కొండచరియపై నిర్మితమైందని గతంలో పరిశోధకులు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని కూడా స్పష్టం చేయడంతో అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.