Telangana: నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాల్సిందే.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న బట్టతల బాధితుల సంఘం
తాము సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నామని తమకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు బట్టతల బాధితులు. లేదంటే ఉద్యమిస్తామంటున్నారు.

తెలంగాణ సర్కార్ అటు డెవలప్‌మెంట్‌కు, ఇటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని పలు వర్గాలకు చేయూతనిస్తుంది. వృద్ధులతో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, కల్లు గీత కార్మికులకు పెన్షన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే మరో ఆశ్చర్యకరమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని బట్టతల బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బట్టతల బాధితుల సంఘం వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం కూడా ఏర్పాటైంది. బట్టతల బాధితుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా వెల్ది బాలయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రామును ఎన్నుకున్నారు సభ్యులు.
తాము కూడా సమాజంలో నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని.. తమను కూడా మానసిక వికలాంగుల కింద పరిగణించి.. పెన్షన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరగని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తమ సమస్యలు పరిస్కరించని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు.
ప్రజంట్ సొసైటీలో బట్టతల బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. మనం లైట్ తీసుకుంటాం కానీ.. బట్టతల వల్ల చాలామంది కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే హెయిర్ ప్లాంటేషన్ చేయిస్తున్నారు. ఇంకా రకరకాల క్రీమ్స్, ఆయుల్స్ కూడా ట్రై చేస్తున్నారు. కొందరు వేవింగ్ చేయించడం, విగ్ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఒక రకంగా వీరి డిమాండ్‌లో లాజిక్ ఉంది. మరి వీరి సమస్యపై ప్రభుత్వం అసలు స్పందిస్తుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




