Telangana: మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య అరెస్ట్.. కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ..!
వరంగల్‌లో మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసం, అనాథాశ్రమంలో సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలపై ఆరోపణలు, హిడ్మాతో పరిచయాలపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నివాసం, నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమంలో ఏకకాలంలో సోదాలు చేపట్టడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జఫర్‌ఘడ్‌లో గాదె ఇన్నయ్య దంపతులు మా ఇల్లు పేరుతో ఒక అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మావోయిస్టులతో ఇన్నయ్యకు ఇంకా సంబంధాలు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అంతకుముందు ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. ఆశ్రమంలోని చిన్నారులు అధికారులను అడ్డుకున్నారు. తమను అక్కున చేర్చుకున్న నాన్నను తీసుకెళ్లవద్దంటూ చిన్నారులు అధికారుల వాహనాలకు అడ్డం పడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాతన చిన్నారులను పక్కకు తొలగించి ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
హిడ్మాతో సంబంధాలే కారణమా?
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మావోయిస్టు కీలక నేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిడ్మా ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత ఇన్నయ్య ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. హిడ్మా మృతి తర్వాత మావోయిస్టు కేడర్‌ను తిరిగి ఏకం చేయడంలో ఇన్నయ్య ఏమైనా పాత్ర పోషిస్తున్నారా?, ఆశ్రమ ముసుగులో మావోయిస్టులకు నిధులు లేదా సమాచారం అందుతోందా? అనే కోణంలో NIA లోతుగా విచారణ చేస్తోంది.
గాదె ఇన్నారెడ్డి గతంలో మావోయిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అప్పటి నుండి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోదాల్లో భాగంగా ఇన్నయ్య నివాసంలో కొన్ని కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు మరియు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




