Hyderabad: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. దసరాలోపు కొత్త ఎస్టీపీల నిర్మాణం వేగం చేయాలన్న దానకిషోర్..
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో దసరా లోపు కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపాదిక పని చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్..
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో దసరా లోపు కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపాదిక పని చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. నూతనంగా చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణంపై బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ – 3 కింద నిర్మించనున్న 17 ఎస్టీపీల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భూవివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను కూడా పూర్తి చేయాలన్నారు.
24 గంటలూ పని జరిపించాలి: దసరాలోపు ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలని దానకిశోర్ అధికారులకు సూచించారు. ఇందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో పనులు జరిపించాలన్నారు. 24 గంటల పాటూ పనులు జరపాల్సి ఉంటుందని, మూడు షిఫ్టుల్లో పని చేసేలా తగినంత మంది కార్మికులు ఉండేలా చూసుకోవాలన్నారు. మెన్, మెటీరియల్, మెషినరీలో ఎక్కడా కొరత రాకుండా పనులు జరగాలని ఆయన సూచించారు.
స్థలాభావం ఉన్న చోట్ల మల్టీలెవల్ ఎస్టీపీలు: కొన్ని చోట్ల స్థలాభావం ఉన్న కారణంగా ఎస్టీపీల సామర్థ్యాన్ని తగ్గించవద్దని దానకిశోర్ ఆదేశించారు. ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టిందని, కావున సామర్థ్యాన్ని తగ్గించవద్దని ఆయన చెప్పారు. స్థలాభావం ఉన్న ప్రాంతాల్లో మల్టీ లెవల్ ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. మల్టీలెవల్ ఎస్టీపీలు అవసరమైన ప్రాంతాలను జలమండలి ఈడీ, ప్రాజెక్ట్ డైరెక్టర్లు స్వయంగా పరిశీలించి పర్యవేక్షించాలని ఆయన సూచనలు చేశారు.
పనులపై నిరంతర పర్యవేక్షణ: కొత్త ఎస్టీపీల నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని దానకిశోర్ సూచించారు. నిర్మాణ ప్రదేశాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్ మానిటరింగ్ కోసం జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో కచ్చితంగా కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో భాగమయ్యే కార్మికుల రక్షణకు కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read: చలికాలంలో మహిళలు ఈ ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి..