Telangana Public Transport: ప్రజా రవాణాకు సడలింపులు.. సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుకు అనుమతి!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి.
Telangana Public Transport Services Resume: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం మరో పదిరోజులపాటు పొడగించింది. మూడో విడుత లాక్‌డౌన్ ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గంటలోపు ఇండ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్ అమలవుతుంది. సడలింపు నేపథ్యంలో ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కూడా సాయంత్రం వరకు రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రజా రవాణా సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.
ప్రస్తుతం సిటీ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు తిరుగుతుండగా, మరింత సడలింపు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. లాక్‌డౌన్ సడలింపు పొడగించడం వల్ల ఆర్టీసీకి మరికొంత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్గో పార్సిల్ సర్వీసులు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు నడుస్తున్న మెట్రో రైళ్లు గురువారం నుంచి సాయంత్రం 5:30 వరకు నడుస్తాయి. మూడు కారిడార్లలో ఉదయం 7 గంటలకు మొదటి రైలు, సాయంత్రం 5.30 గంటలకు చివరి రైలు స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇప్పటివరకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది.