5

Telangana Strengthen Medical Infra: తెలంగాణలో ప్రజారోగ్యం మరింత పటిష్ఠం.. జిల్లా ఆస్పత్రులకు మహార్ధశ.. త్వరలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్టు!

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.

Telangana Strengthen Medical Infra: తెలంగాణలో ప్రజారోగ్యం మరింత పటిష్ఠం.. జిల్లా ఆస్పత్రులకు మహార్ధశ.. త్వరలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్టు!
Telangana Govt.strengthen Medical Infrastructure
Follow us

|

Updated on: Jun 09, 2021 | 7:23 AM

Telangana Govt.Strengthen Medical Infrastructure: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాగుకోసం గత ఏడేండ్లుగా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇక ఈ రంగాన్ని నూటికి నూరు శాతం ప్రజల సేవకు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా సాగునీటి రంగాన్ని తీర్చిదిద్ది గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే ఇప్పుడు వైద్య రంగాన్ని సమూలంగా సంస్కరించాలని కేబినెట్‌ సమావేశం తీర్మానించింది. ఇందుకోసం ప్రత్యేక మంత్రులతో కూడిన సబ్ కమిటీని నియమించింది.

రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

రానున్న రెండేళ్లలో వైద్య వ్యవస్థ బాగుకోసం మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా తరహా మహమ్మారులు పీడిస్తున్న తరుణంలో మున్ముందు ఇలాంటి ఆరోగ్య విపత్తులు ఎన్ని ఎదురైనా తట్టుకొని నిలిచేలా, పేదలకు, ప్రజలకు చౌకగా, అత్యంత నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయి చికిత్సలు అందించేలా ప్రభుత్వ వైద్య వ్యవస్థను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిపాలన మొదలుకొని, పారామెడికల్‌ సేవల దాకా విప్లవాత్మక మార్పులు తేనున్నారు. ప్రతి జిల్లాలో పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు పొందేలాగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు, ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయబోతోంది. ఈ మేరకు సమగ్ర నివేదికను తయారు చేయాలని మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సబ్‌ కమిటీని మంత్రిమండలి ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌ కేంద్రంగా మారిన వైద్యసేవలను జిల్లా కేంద్రాలే యూనిట్‌గా విస్తరించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా స్థాయిలోనే వైద్యసేవలు అందించడంతోపాటు, వైద్య పరీక్షా కేంద్రాలనూ ఏర్పాటుచేయనున్నది. అన్ని జిల్లాల్లో కేన్సర్‌ కేంద్రాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, టుడీ ఈకోతోపాటు మహిళల కేన్సర్‌ స్రీనింగ్‌ కోసం ‘మామోగ్రామ్‌’ యంత్రాలను ఏర్పాటుచేయాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటుచేసిన డయాలసిస్‌ కేంద్రాల్లో యంత్రాల సంఖ్యను పెంచడంతోపాటు, మరిన్ని కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. కరోనా మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, ఔషధాలను సమకూర్చుకోవాలని ఆదేశించింది.

చర్మ సంబంధ జబ్బుల పరీక్షలు, చికిత్సకోసం హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించింది. సత్తుపల్లి, మధిరలో 100 పడకలతో నూతన దవాఖానలను నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించింది. సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని నిర్ణయించింది.

కేన్సర్‌ రోగులకు కీమోథెరపీ, రేడియో థెరపీ కోసం అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేంద్రాల్లోనే కేన్సర్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. దవాఖానల్లో ఇప్పటికే ఉన్న బ్లడ్‌ బ్యాంకులను ఆధునికీకరించడంతోపాటు మరిన్ని కొత్త బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఆర్థోపెడిక్‌, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని వైద్యశాఖకు సూచించింది. రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రాలను మరింతగా పటిష్ఠ పర్చాలని కేబినెట్‌ నిర్ణయించింది. తల్లీబిడ్డలను ఇతర రోగులతో కాకుండా.. ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని సూచించింది.

వరంగల్‌లో ఖాళీచేస్తున్న జైలు స్థలంలో ఎయిమ్స్‌ తరహాలో అన్నిహంగులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అన్ని ఆసుపత్రుల నిర్వహణకు హాస్పిటల్‌ అడ్మిస్ట్రేషన్‌ కోర్సు అభ్యసించిన వారిని నియమించుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యశాలల్లో నర్సింగ్‌, మిడ్‌వైఫరీ కోర్సులను, లాబ్‌ టెక్నిషియన్‌, రేడియాలజీ టెక్నిషియన్‌, డయాలసిస్‌ టెక్నిషియన్‌ తదితర ప్రత్యేక నైపుణ్యం ఉన్న కోర్సులను అందుబాటులోకి తేవాలని వైద్యశాఖను ఆదేశించింది.

Read Also….  Telangana Public Transport: ప్రజా రవాణాకు సడలింపులు.. సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుకు అనుమతి!