రాజ్ కుమార్ బయటకు ఎలా వచ్చాడు.. మాటల్లో కాదు చేతల్లో చూపాలి.. విజయశాంతి సంచలన ట్వీట్..
షాబాద్‌లో ఆరుగురి హత్యల కేసు నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం ఒక అంశమైతే, అసలు పోక్సో కేసులో అతడు స్టేషన్ బెయిల్‌పై బయటకు ఎలా వచ్చాడన్న విషయంపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె బయటకు వస్తే.. ప్రెస్ మీట్ పెడితే మాటల తూటాలు పేలేవి. కొన్నాళ్లుగా చాలా సైలెంట్ అయిపోయిన విజయశాంతి.. ఇప్పుడు గేర్ మార్చారు. కనిపించీ, కనిపించనట్లు, వినిపించీ వినిపించనట్లు తాను చెప్పాలనుకున్న విషయాన్ని ట్వీట్స్ రూపంలో బయటపెడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. మొన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, తాజాగా మహిళల భద్రత విషయంలోనూ తనదైన స్టైల్‌లో స్పందించారు. మహిళా భద్రతకు ప్రాధాన్యత.. మాటల్లో కాదు చేతల్లో చూపాలన్నారు కాంగ్రెస్ MLC విజయశాంతి. షాబాద్ హత్యల నిందితుడు ఆత్మహత్య సరే.. అసలు పోక్సో కేసు నుంచి రాజ్‌కుమార్ బయటకు ఎలా వచ్చాడని ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్ రావడంలో పోలీసుల నిర్లక్ష్యం లేదా? అని అడిగారు. పోలీస్‌శాఖలో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు విజయశాంతి. మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. షాబాద్ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని.. మహిళల భద్రత విషయంలో ఇకనైనా కఠినంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు విజయశాంతి.
జూన్ 26న ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ట్వీట్ చేశారు విజయశాంతి. హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం.. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక.. విద్యార్థులు పడుతున్న అవస్థలను.. శాసనమండలి వేదికగా తాను మాట్లాడిన విషయాన్ని కూడా ట్వీట్‌లో ప్రస్తావించారు విజయశాంతి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముందు విజయశాంతి ఓ ప్రతిపాదన పెట్టారు. చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ ప్రమాణాలను పాటించడం లేదని, అసలు కొన్ని కాలేజీలలో సరైన సదుపాయాలు కూడా లేవని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. ఫీజులు చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. కనీస ప్రమాణాలు పాటించని కాలేజీలపై.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయశాంతి.
