అర్ధరాత్రి అనుమానాస్పదంగా కనిపించాడు.. ఆపి చెక్ చేయగా కుప్పల కుప్పల ఇంజెక్షన్లు
ఆదిలాబాద్ పోలీసులు కెమికల్ డ్రగ్స్, ముఖ్యంగా సర్జరీలలో వాడే టెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. అధిక ధరలకు మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారని గుర్తించి, రూ.390 విలువైన ఇంజెక్షన్‌ను రూ.1500లకు అమ్ముతున్నారని ఎస్పీ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో కెమికల్ డ్రగ్స్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొ నలుగురు నిందితుల కోసం సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 12న అర్థరాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా స్కూటీపై సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పారిపోవడానికి యత్నించాడు. వెంటనే పోలీసులు అలర్ట్ అయి అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా నిందితుడు సిందే జగన్నాథ్ (RMP) అని తెలింది.
విచారణలో సర్జరీల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన “టర్మిన్ (Mephentermine Sulphate Injection IP)” అనే మత్తు మందును మెడికల్ ఏజెన్సీ, మెడికల్ షాపు నిర్వాహకుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, గంజాయి ముఠాకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఏ-1 సిందే జగన్నాథ్, ఏ-3 సయ్యద్ కమరుద్దీన్ (గెట్ వెల్ మెడికల్)తో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఏ-2 రమేష్ గౌడ్ (జగదాంబ ఫార్మసీ అండ్ సర్జికల్స్), ముషారఫ్, సమీర్, ఇర్ఫాన్ ఖాన్, ముకీద్ పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
టర్మిన్ ఇంజక్షన్ ధర 390 ఉండగా దానిని బహిరంగ మార్కెట్లో 1500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారను.. ఇలా అడ్డదారిలో సర్జరీ ఇంజక్షన్లను వాడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ మందులు డాక్టర్లకు మాత్రమే విక్రయించాల్సి ఉండగా నేరస్తులు బహిరంగంగా ప్రజలకు విక్రయిస్తూ యువకులను మత్తుకు బానిస చేస్తున్నట్టు గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుండి 190 ఇన్సులిన్ సిరంజలు, 50 టర్మిన్ బాటిల్స్, రెండు మొబైల్ ఫోన్స్, ఒక స్కూటీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అని తెలిపారు. గతంలో కూడా ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టర్మిన్ మత్తు ఇంజెక్షన్లను దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ఎస్పీ గుర్తు చేశారు. వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్‌ఐ అఖిల్,ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
