AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..!

నెల్లూరు జిల్లాలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. దండుపాళ్యం సినిమాను తలపించే విధంగా ఇవి ఉన్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశించి అందినకాడికి దొచుకుంటున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో తిరుగుతూ బురిడీ కొట్టిస్తున్నారు.

Andhra Pradesh: 'దండుపాళ్యం' తరహా ముఠా..?  పట్టపగలే రెక్కీ... క్షణాల్లో చోరీ..!
Theft
Ch Murali
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 3:57 PM

Share

నెల్లూరు జిల్లాలో దండుపాళ్యం సినిమా తరహాను తలపించే చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు.. ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంటి బిడ్డలను వెంట తీసుకుని, చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇంటింటినీ పరిశీలించడం ఈ ముఠా ప్రత్యేకతగా కనిపిస్తోంది. వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో ఈ తరహా ఘటన వెలుగుచూసింది. గోనె సంచులు ఏరుకునే వారి ముసుగులో గ్రామంలోకి ప్రవేశించిన మహిళలు, ఓ వ్యక్తితో కలిసి ముందుగా గ్రామమంతా రెక్కీ నిర్వహించారు. ఆటో బాడుగకు వచ్చామని స్థానికులను నమ్మిస్తూ వారి దృష్టి మరల్చిన అనంతరం తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు.

ముందుగా పోలిచర్ల నాయబ్ రసూల్ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంటి తాళాలు, బీరువా పగులగొట్టి సుమారు ఐదు సవర్ల బంగారాన్ని అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం అదే గ్రామంలోని శ్రీ రామాలయంలోకి చొరబడి కలశంతో పాటు పూజా సామగ్రిని కూడా ఎత్తుకెళ్లారు. ఒకే గ్రామంలో వరుసగా రెండు చోట్ల చోరీలు జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. చోరీలు చేసి పరారవుతున్న దుండగులను గ్రామస్తులు వెంబడించి పట్టుకోవడం ఈ ఘటనలో కీలక మలుపుగా మారింది. మహిళలతో పాటు ఓ పురుషుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. చంటి బిడ్డలను భుజాన ఎత్తుకుని గ్రామంలో సంచరిస్తూ ముందుగానే రెక్కీ నిర్వహించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

ముందుగా రెక్కీ… ఆ తర్వాత క్షణాల్లో చోరీ… ఇదే పద్ధతిని అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దండుపాళ్యం సినిమా తరహా చోరీలను గుర్తుకు తెస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తుండగా.. ఇదే ముఠా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us