Cm Revanth Reddy: పెట్టుబడులే టార్గెట్.. మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రాలనికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మరోసారి విదేశీ టూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్దమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యక్షంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెంచే దిశగా ఈ పర్యటనను ప్రభుత్వం రూపొందించింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం పర్యటించనున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పర్యటనలో ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల సీఈఓలు, పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, తయారీ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCలు), లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా “తెలంగాణ రైజింగ్” బ్రాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులు, విదేశీ రోడ్‌షోల ద్వారా ఇప్పటికే అనేక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈసారి విదేశీ పర్యటనలో ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన సంస్థలతో పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఫార్చ్యూన్-500 కంపెనీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు ముందు ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సమిట్‌లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించడంలో ఈ విదేశీ టూర్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
విదేశీ పర్యటన సందర్భంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, మౌలిక వసతులు, ఫ్యూచర్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్లు, ప్రపంచ స్థాయి కనెక్టివిటీ వంటి అంశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఈ పర్యటనను ప్రభుత్వం వ్యూహాత్మకంగా రూపొందించినట్లు సమాచారం.
ఈ పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణలో కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
