సాఫ్ట్‌వేర్ క్రేజ్ తగ్గిందా..? BA, BCom కోర్సుల వైపు విద్యార్థుల పరుగులు! మారిన కెరీర్ ట్రెండ్స్
రాష్ట్ర డిగ్రీ అడ్మిషన్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంజినీరింగ్ వైపు పరుగులు తీసిన విద్యార్థులు ఇప్పుడు బీఏ, బీకాం కోర్సులను ఎంచుకుంటున్నారు. కామర్స్, ఆర్ట్స్ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరగగా, సివిల్స్, కార్పొరేట్ ఉద్యోగాలు, ఏఐ ప్రభావం, హ్యూమన్ స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత వంటి అంశాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు..

హైదరాబాద్, ఆగస్ట్ 5: ఇంజనీరింగ్.. టెక్నాలజీ.. కోడింగ్‌లు.. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది.. రూటు టోటల్‌గా సైడ్ అయింది. ఒకప్పుడు ఇంజనీరింగ్ మోజులో పడి అటకెక్కిన ఆర్ట్స్, కామర్స్ కోర్సులు ఇప్పుడు మళ్లీ కింగ్ లా సింహాసనాన్ని అధిరోహించాయి. ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ తిరిగిన కుర్రాళ్లు.. ఇప్పుడు బీఏ.. బీకాం వైపు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏంటి ఈ క్రేజ్? ప్రైవేట్ వర్సిటీల్లో లక్షల ఫీజులు కట్టి మరీ ఆర్ట్స్‌లో ఎందుకు చేరుతున్నారు? ఇంజనీరింగ్ పక్కన పెట్టి మరీ.. విద్యార్థులు ఈ దారి ఎందుకు పడుతున్నారు? అసలు ఈ ట్రెండ్ వెనుక ఉన్న నిజాలేంటీ ?
తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో సరికొత్త విప్లవం వస్తోంది. కామన్ డిగ్రీ ప్రవేశాల్లో బీఎస్సీ మ్యాథ్స్, సైన్స్ పై క్రేజీ తగ్గింది. ఆర్ట్స్ కోర్సులపై మమకారం పెరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరానికి ఈ యేడాది లక్షా 15 వేల మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఒక్క బీకాం లోనే ఏకంగా 42 వేలకు పైగా అడ్మిషన్లు నమోదయ్యాయంటే.. కామర్స్ రంగంలో అవకాశాలపై కుర్రాళ్లు ఏ మేరకు ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతోంది. ఇక ఎప్పుడో పనికిరాదంటూ పక్కన పెట్టిన బీఏ కోర్సులో ఏకంగా 18 వేల వరకు జాయినింగ్స్ జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ప్రైవేట్ యూనివర్శిటీలో బీఏ కోర్సుకే ఏడాదికి ఆరు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారంటే.. ఆర్ట్స్ పట్ల కార్పొరేట్ స్థాయిలో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఉపాధి అవకాశాలు పెరగడంతోనే బీకాం ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ జాబ్స్ అంటూ పరిగెత్తిన కుర్రాళ్లు.. ఆకస్మికంగా బీఏ, బీకాం వైపు ఎందుకు యూటర్న్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. సివిల్స్, గ్రూప్స్ లాంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలపై తెలంగాణ యువత దృష్టి ఇప్పుడు ఫోకస్ అయింది. బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే బీఏ బెస్ట్ ఆప్షన్ అని కుర్రాళ్ళు ఫిక్స్ అయ్యారు. గ్లోబల్ మార్కెట్‌లో ఫైనాన్షియల్ ఎనలిస్టులు, ఆడిటర్లు, కార్పొరేట్ లాయర్లు, డేటా కామర్స్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో బీకాంకు గోల్డెన్ డేస్ వచ్చాయని చెబుతున్నారు కామర్స్ ఎక్స్ పర్ట్స్.
కోడింగ్ ఉద్యోగాలకు ఏఐ రూపంలో ముప్పు పొంచి ఉందనే భయంతో.. హ్యూమన్ స్కిల్స్, పాలిటిక్స్, ఎకానమీ, సోషియాలజీ సబ్జెక్టులుండే ఆర్ట్స్‌పై ఆసక్తి అమాంతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం డిగ్రీ కాదు.. కెరీర్‌కు పర్ఫెక్ట్ ల్యాండింగ్. చదివే కాలేజీ ఏదైనా సరే.. సబ్జెక్ట్‌పై పట్టు ఉంటే ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్‌కు కార్పొరేట్ ప్రపంచంలో కోట్లు కొల్లగొట్టే అపారమైన అవకాశాలున్నాయి అని విద్యా నిపుణులు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి డిగ్రీ అంటే డల్ అనుకున్న వాళ్ల నోళ్లతోనే.. ఇప్పుడు ఆర్ట్స్ ఈజ్ ది రియల్ కింగ్ అనిపించేలా చేస్తున్నారు.
