Life Lesson: ఈ ఒక్క పాఠం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఐదేళ్ల రాజు కథలో గొప్ప జీవిత సత్యం
భవిష్యత్తు మనకు ఎలా ఉండాలో ఈరోజే నిర్ణయించుకోవాలి. సమయాన్ని వృథా చేయకుండా, ముందుచూపుతో కష్టపడితే మన జీవితాన్నే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈరోజు చేసే కృషి, పొదుపు, ప్రణాళికే రేపటి విజయానికి పునాది. ప్రస్తుతం దొరికిన అవకాశాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు.. భవిష్యత్తును నిర్మించుకోవడం కూడా మన బాధ్యత..

ఒకప్పుడు ఓ విచిత్రమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక వింత నియమం ఉండేది. ప్రతి ఐదేళ్లకు ఒక కొత్త రాజును ఎన్నుకునేవారు. అయితే ఆ ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఆ రాజును అడవిలో వదిలేసేవారు. ఆ అడవి చాలా దట్టంగా ఉండేది. అక్కడ తినడానికి ఏమీ ఉండేది కాదు. క్రూరమైన జంతువులు తిరుగుతుండేవి. ఒక్కసారి ఆ అడవిలోకి వెళ్లిన తర్వాత ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం. ప్రతి ఐదేళ్లు పూర్తయిన రాజుకు కొత్త బట్టలు వేసి, ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. చివరికి ఒక పడవలో ఎక్కించి ఆ భయంకరమైన అడవికి పంపించేవారు. అలా ఒక రాజును పంపించిన తర్వాత ప్రజలు మళ్లీ కొత్త రాజు కోసం వెతికేవారు. ఒకరోజు ప్రజలందరూ ఓ తెలివైన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ‘మీరు మా రాజుగా ఉండాలి. మీరు చాలా తెలివైనవారు. మా రాజ్యాన్ని ఎంతో బాగా పాలించగలరు’ అని కోరారు. అతను వెంటనే అంగీకరించలేదు.
ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న నియమం అతనికి తెలుసు. ‘ఐదేళ్ల తర్వాత నన్ను కూడా అదే అడవిలో వదిలేస్తారు కదా?’ అని అడిగాడు. ‘అవును’ అని ప్రజలు చెప్పారు. అతను కొంతసేపు ఆలోచించాడు. చివరకు ఒక షరతుతో రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. ‘సరే. నేను రాజుగా ఉంటాను. ఐదేళ్ల తర్వాత ఆ అడవికి వెళ్లడానికి కూడా సిద్ధమే. కానీ నాకు ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పటివరకు రాజులను ఎక్కడికి తీసుకెళ్లారో ఆ ప్రదేశాన్ని నేను చూడాలి’. ప్రజలు అతన్ని ఆ అడవికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అడవి చాలా దట్టంగా ఉంది. చుట్టూ క్రూర మృగాలు తిరుగుతున్నాయి. గతంలో రాజులుగా పనిచేసినవారి అవశేషాలు అక్కడ కనిపించాయి.
కొంతసేపు ఆ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘ఐదేళ్ల తర్వాత నేను ఇక్కడికి రావాల్సిందే. మరి ఇప్పుడే దీన్ని ఎందుకు మార్చకూడదు?’ అప్పటి నుంచి అతని అసలు పని మొదలైంది.
మొదటి సంవత్సరం అడవిలోని చెట్లను తొలగించడం ప్రారంభించాడు. క్రూర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. రెండో సంవత్సరం అడవిని పూర్తిగా శుభ్రం చేయించాడు. నివాసయోగ్యమైన ప్రదేశంగా మార్చే పనులు మొదలయ్యాయి. మూడో సంవత్సరం అక్కడ వ్యవసాయం ప్రారంభించాడు. పంటలు పండించడం మొదలైంది. నాలుగో సంవత్సరం రోడ్లు వేశారు. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఐదో సంవత్సరం కుటుంబాలు అక్కడ నివసించడం ప్రారంభించాయి. ఒకప్పుడు భయంకరమైన అడవిగా ఉన్న ప్రదేశం ఇప్పుడు అందమైన కొత్త రాజ్యంగా మారిపోయింది. అంతేకాదు.. ఆ రాజు తన రాజ్య సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేయలేదు. అవసరమైన వాటికే ఖర్చు చేసి, తన భవిష్యత్తు కోసం డబ్బును కూడా పొదుపు చేశాడు. చివరకు ఐదేళ్లు పూర్తయ్యే సమయం వచ్చింది. రాజు ప్రజలతో ‘నా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు నన్ను మనం అనుకున్న ప్రదేశానికి పంపించండి’ అన్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు.
‘మహారాజా.. ఇంకా పది రోజులు సమయం ఉంది’ అన్నారు. కానీ రాజు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నాడు. పది రోజులు గడిచాయి. రాజుకు కొత్త బట్టలు వేశారు. ఏనుగుపై కూర్చోబెట్టారు. ప్రజలు అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. అయితే అందరూ ఒక విషయాన్ని గమనించారు. రాజు ఏడవడం లేదు. పైగా నవ్వుతున్నాడు! గతంలో ప్రతి రాజు ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకునేవాడు. ‘మహారాజా.. మీరు ఎందుకు నవ్వుతున్నారు?’ అని ప్రజలు అడిగారు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు ‘మీరు గతంలో వచ్చిన రాజులందరినీ చూశారు. వాళ్లు తమ ఐదేళ్లను రాజ్యాన్ని ఆస్వాదించడంలో, విలాసవంతమైన జీవితాన్ని గడపడంలోనే గడిపారు. ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో మర్చిపోయారు. కానీ నేను మాత్రం నా భవిష్యత్తును మర్చిపోలేదు’. ‘నేను రాజుగా ఉన్న ఐదేళ్లలో నా భవిష్యత్తు కోసం పనిచేశాను. నేను వెళ్లాల్సిన అడవిని ముందే చూశాను. అది ఎలా ఉందో తెలుసుకున్నాను. దాన్ని మార్చాను. అక్కడ ఒక కొత్త రాజ్యాన్ని నిర్మించాను. నా కోసం పొదుపు చేసుకున్నాను’. ‘అందుకే ఇప్పుడు నేను భయపడటం లేదు. నేను వెళ్లాల్సిన ప్రదేశం నాకు తెలుసు. అక్కడ నా కోసం ఒక అందమైన జీవితం సిద్ధంగా ఉంది’.. అని చెప్పి రాజు చిరునవ్వుతో తన కొత్త రాజ్యం వైపు బయలుదేరాడు.
ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటి?
మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. ఈరోజు మన దగ్గర ఉన్న సమయం.. మన భవిష్యత్తును నిర్మించడానికి ఉన్న అవకాశం. ముఖ్యంగా 16 నుంచి 24 సంవత్సరాల వయసు ఎంతో కీలకమైన దశ. ఈ సమయంలో మనకు ఉన్న శక్తి, ఉత్సాహం, నేర్చుకునే సామర్థ్యం, కొత్త విషయాలు ప్రయత్నించే ధైర్యం తర్వాతి దశల్లో అంతగా ఉండకపోవచ్చు. ఈ వయసులో చదువు, కెరీర్, నైపుణ్యాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక క్రమశిక్షణ వంటి విషయాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మన జీవితం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సమయాన్ని మొత్తం వినోదం, సోషల్ మీడియా, అవసరం లేని విషయాల్లో గడిపేస్తే.. మన భవిష్యత్తు కోసం ఎలాంటి పునాది ఉండదు. ఆ రాజు తన కోసం అడవిని మార్చుకున్నాడు. మరి మనం? మన భవిష్యత్తు కోసం మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? లేక.. మన జీవితమనే అడవిని అలాగే వదిలేస్తున్నామా?
గుర్తుంచుకోండి.. భవిష్యత్తు ఒక్కరోజులో మారదు. కానీ ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. మీ దగ్గర ఉన్న సమయాన్ని వృథా చేయకండి. ఈరోజే మీ భవిష్యత్తు కోసం పని ప్రారంభించండి..




