Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు రిలీజ్.. చెక్ చేసుకున్నారా..?
ఏపీ ప్రభుత్వం మరో పథకం డబ్బులను విడుదల చేసింది. మేలో వారికి రూ.20 వేలు అందించగా.. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం వారికి నిధులను అందించింది. ఈ మేరకు తాజాగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెలలో తల్లికి వందనం నిధులను జమ చేయనుండగా.. తాజాగా మరో పథకం నిధులు కూడా విడుదల చేసింది. తల్లికి వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రుల అకౌంట్లో రూ.13 వేలు జమ చేయనుంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో వీటిని అందించనుంది. అయితే తాజాగా మత్స్యకారుల సేవలో పథకం కింద లబ్దిదారులకు ఆర్ధిక సాయం విడుదల చేసింది. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.20 వేలు జమ చేసింది. మే నెలలో మత్స్యకారుల కుటుంబాలకు ఈ పథకం సొమ్మును ప్రభుత్వం అందించింది. ఈ మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన కార్యక్రమంలో తన చేతుల మీదుగా నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
అయితే తాజాగా మరో 5910 మత్స్యకారులకు నిధులను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.11.82 కోట్లు మంజూరు చేసింది. వీరి అకౌంట్లలో రూ.20 వేల చొప్పున జమ చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు 1,28,388 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.256.77 కోట్లు విడుదల చేయగా.. తాజాగా 5910 మందికి రిలీజ్ చేయడంతో మొత్తం 1,34,298 మందికి లబ్ది చేకూరినట్లయింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది లబ్దిదారులకు గతంలో నిధులు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం వారికి కూడా ఇప్పుడు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు అందటంతో ఎగిరి గంతేస్తున్నారు. గతంలో టెక్నికల్ సమస్యలు వల్ల కొంతమందికి నిధులు విడుదల చేయలేదని, ఇప్పుడు వారికి కూడా అందించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
కాగా ఏపీలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో సముద్రంలో చేపలు వృద్ధి చెందుతాయి. దీంతో వాటికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది ఈ సమయంలో చేపలను వేటను నిషేధిస్తూ ఉంటుంది. దీంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వారికి ఆర్దిక సాయం అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేల సాయం అందిస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మత్స్యకారుల సంక్షేమం, ఆర్ధిక భద్రతను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.
