AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అన్ని స్కూళ్లు, కాలేజీల్లోకి కొత్త సబ్జెక్ట్?

దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సమగ్ర లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆమోదం అనంతరం దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. బాలలపై లైంగిక దాడుల అవగాహన, సేఫ్-అన్‌సేఫ్ టచ్ వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది..

POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అన్ని స్కూళ్లు, కాలేజీల్లోకి కొత్త సబ్జెక్ట్?
Supreme Court On Comprehensive Body Education
Srilakshmi C
|

Updated on: Jul 14, 2026 | 9:30 AM

Share

న్యూఢిల్లీ, జులై 14: దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ‘సమగ్ర లైంగిక విద్య’ (Comprehensive Body Education) ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని, కోర్టు అనుమతి లభించిన వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం అంగీకరించిందని, దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కమిటీ ఎందుకు ఏర్పాటైందంటే..?

యువత మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడే సంబంధాలు, మైనర్ గర్భధారణలకు సంబంధించిన కేసులు పోక్సో (POCSO) చట్టం కింద క్రిమినల్ కేసులుగా మారకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అదనపు కార్యదర్శి నేతృత్వంలో 26 మంది సభ్యులతో కూడిన జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు కలిగే కౌమారదశ యువత గోప్యతా హక్కులు, పోక్సో చట్టం ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసే బాధ్యత అప్పగించారు.

కమిటీ చేసిన కీలక సిఫార్సులు ఇవే..

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS), క్లినికల్ సైకాలజిస్టులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NLSA) ప్రతినిధులు సభ్యులుగా ఉన్న కమిటీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన పలు కీలక అంశాలు సూచించింది.

  • సమగ్ర లైంగిక విద్య (Comprehensive body Education)
  • బాలలపై లైంగిక దాడుల అవగాహన (Child Abuse Awareness)
  • వ్యక్తిగత పరిశుభ్రత (Hygiene)
  • శరీర భాగాలపై ప్రాథమిక అవగాహన
  • భద్రతా అంశాలు
  • సురక్షిత, అసురక్షిత స్పర్శ (Safe & Unsafe Touch) గురించి విద్య

ఈ అంశాలను ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలని కమిటీ సూచించింది. ఈ అంశాలపై తగిన పాఠ్య ప్రణాళికను రూపొందించాలని NCERTకి కమిటీ సూచించింది. అలాగే జాతీయ విద్యా విధానం-2020 (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల్లో కౌమారదశ విద్యను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని కమిటీ సిఫార్సు చేసింది. వారానికి కనీసం రెండు సార్లు తప్పనిసరిగా సమగ్ర లైంగిక విద్యపై తరగతులు నిర్వహించాలి. ప్రతి తరగతి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి. అలాగే పిల్లల ఎదుగుదల దశలు, లైంగిక విద్య ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కమిటీ నివేదికను సీనియర్ న్యాయవాదులు మాధవి దివాన్, లిజ్ మాథ్యూ స్వాగతించారు. అయితే ‘సమగ్ర లైంగిక విద్య’ అనే అంశాన్ని మరింత స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Follow Us