దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..
Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విభేదాల కారణంగా రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు చిన్నారులు, మైనర్ బాలికతో పాటు మరో ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో ముగిశాయి. బంధువులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో, అధికారుల సమక్షంలో పోలీసు భద్రత మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందే చితికి నిప్పంటించారు. పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10 అర్ధరాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను రాజ్‌కుమార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆరుగురిని చంపిన అనంతరం పరారైన రాజ్ కుమార్.. కొత్తూరు మండలం పంజర్లలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద విషం బాటిల్ లభ్యమైంది.
కన్నీళ్లు పెట్టుకున్న తల్లీతండ్రి..
అనంతరం.. చేవెళ్లలో రాజ్‌కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. మార్చురీలో ఉన్న రాజ్ కుమార్ మృతదేహం చూసేందుకు అతడి తల్లి, తండ్రి, సోదరుడిని పోలీసులు తీసుకువెళ్లారు. రాజ్ కుమార్ మృతదేహం చూసి తల్లి, తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.
అయితే రాజ్ కుమార్ మృతదేహం చూసేందుకు అతడి సోదరుడు నిరాకరించాడు. తమ కుటుంబ పరువు పోయిందంటూ మృతదేహం చూసేందుకు రాజ్‌కుమార్ సోదరుడు నిరాకరించాడు.
షాబాద్ ఘటనలో మరో ట్విస్ట్
ఇదిలాఉంటే.. షాబాద్ ఘటనలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. బాండ్ పేపర్‌పై రాజ్‌కుమార్ సూసైడ్ నోట్ రాశాడు.. తన చావుకు నలుగురు కారణమన్న రాజ్‌కుమార్.. సూసైడ్ నోట్లో నలుగురి పేర్లు రాశాడు.. 4 పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మీద కేసు పెట్టి రూ.50 లక్షలు డిమాండ్ చేశారన్నాడు.. రూ.50లక్షలు ఇస్తే తప్ప రాజీపడబోమని వారు చెప్పారని రాజ్‌కుమార్ దానిలో రాశాడు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
