High Court on Schools: స్కూల్స్ రీఓపెన్‌పై హైకోర్టు కీలక సూచన.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న విద్యాశాఖ
జులై 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభించాలన్న దానిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది.
High Court Hearing on the Commencement of Schools: జులై 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభించాలన్న దానిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా అనంతరం తెరుచుకుంటున్న విద్యా సంస్థల నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పూర్తి వివరణ ఇచ్చారు. ఏయే తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలన్న దానిపై హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
అయా స్కూళ్లల్లో ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సందీప్ కుమార్ సుల్తానియా తేల్చి చెప్పారు. ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని హైకోర్టుకు నివేదించారు. అయితే, ఇందుకు సంబంధించి విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవల్సి ఉంటుందన్నారు. స్కూళ్లల్లో పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని విద్యా శాఖ కార్యదర్శి వివరించారు.
అయితే, పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయ పడింది. దీంతో హైకోర్టు ఆదేశాలను పరిగణంలోకి తీసుకుని పాఠశాలల ప్రారంభంపై పూర్తి విధివిధానాలు ఖరారు చేస్తామన్న సుల్తానియా కోర్టుకు నివేదించారు. దీంతో వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దశల వారీగా తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 8, 9, 10 తరగతులు, అదే నెల 20 నుంచి 6, 7 తరగతుల విద్యార్థులకు ముఖాముఖి బోధన ప్రారంభించాలని అనుకుంటున్నారు. మిగిలిన తరగతులకు కూడా మరో నెల, నెలన్నర రోజుల తేడాలో ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం స్కూల్‌కి వెళ్లే పిల్లలున్న ప్రతి తల్లి, తండ్రిని మాత్రమే కాదు అటు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల్లోనూ గుబులు పుట్టిస్తోంది.ఒకప్పుడు 200 మంది విద్యార్థులు ఉన్న మా స్కూల్‌లో కరోనా వల్ల ఇప్పుడు కేవలం 32 మంది చిన్నారులే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. స్కూల్ ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదు. కనీసం అక్టోబర్, నవంబర్ వరకు స్కూల్ తెరవాల్సిన అవసరం ఉండకపోవచ్చని ప్రైవేట్ స్కూల్స్ నిర్వహకులు చెబుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ లేకపోవడంతో పిల్లల టైమ్ టేబుల్ మారిపోయింది. ఇటు లావాదేవీలు లేక ఇంటి బడ్జెట్ కూడా మొత్తం మారిపోయింది. ఇటు కరోనా మిగిల్చిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా కోలుకోనూ లేదు. మరోవైపు, పిల్లలకు కూడా కోవిడ్ వస్తోందన్న భయం. అలాంటిది ఓ వైపు థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతూ ఉంటే, ఇప్పుడు స్కూల్‌కి ఎలా పంపించగలమంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. సంవత్సరం వృథా అయిన ఫరవాలేదు కానీ పిల్లలని స్కూల్‌కి ఇప్పుడయితే పంపంటున్నారు మరికొందరు. కరోనా తగ్గినప్పుడు చూద్దాం. పిల్లల జీవితమే నాకు ముఖ్యమంటున్నారు.