Devadula Project: గోదావరిలో వరద ఉధృతి.. దేవాదుల ఎత్తిపోతల పనులకు ఆటంకం.. టన్నెల్, పంప్ హౌస్, సర్జ్ పూల్ లకు భారీ నష్టం
Telangana Heavy Rains: తాజా వరదల ఫలితంగా ఈ భూగర్భ టన్నెల్ లోకి నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా టన్నెల్ గుండా వరద నీరు ఆసియా లోనే అతి పెద్ద వర్టికల్ సర్జ్ పూల్‌లోకి చేరి పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పనులు పూర్తి కావొస్తున్నా దశలో ఈ వరదలు..

Devadula Lift Irrigation Project: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం వందేళ్లలో ఇదే ప్రథమం. నిండుకుండలా మారడంతో రాష్ట్రంలోని ఎస్సారెస్పీ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. గోదావరి బేసిన్ పరిధిలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురవడంతో కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసారి, పెద్దవాగు తదితర ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. లక్ష్మీ బ్యారేజీ 81 గేట్లు, సరస్వతీ 54, ఎల్లంపల్లి 41 గేట్లు ఎత్తారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి మట్టం 83.70 మీటర్లకు పైగా ఉంది. దీంతో తెలంగాణలో గోదావరినదిపై రెండో అతిపెద్ద బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. రేపో మాపో ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే జోరు వానలతో అంతరాయం ఏర్పడింది.
ఈ క్రమంలో దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ -3లోని ప్యాకేజ్ -3 పనులకూ ఆటంకం కలిగే రీతిలో వరద విలాయం సృష్టిస్తోంది. ఈ వరద తాకిడికి ప్యాకేజ్ 3 లోని టన్నెల్, పంప్ హౌస్, సర్జ్ పూల్ లకు భారీ నష్టం జరిగింది. భారీ ఎత్తున ముంచెత్తుతున్న వరద, చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ఫలితంగా ఈ కీలక ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ములుగు జిల్లా రామప్ప ట్యాంక్ నుంచి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి.
నదికి ముంచెత్తిన వరదల ఫలితంగా పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులో భాగమైన టన్నెల్, సర్జ్ పూల్ లను వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 49 కిలోమీటర్ల సుదూరమైన భూగర్భ టన్నెల్ నిర్మించారు. ఇది ప్రపంచంలోనే నీటిపారుదల రంగంలో అతిపెద్ద సింగల్ టన్నెల్‌గా ఇది నిలుస్తుంది.
అయితే తాజా వరదల ఫలితంగా ఈ భూగర్భ టన్నెల్ లోకి నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా టన్నెల్ గుండా వరద నీరు ఆసియా లోనే అతి పెద్ద వర్టికల్ సర్జ్ పూల్‌లోకి చేరి పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పనులు పూర్తి కావొస్తున్నా దశలో ఈ వరదలు ముంచెత్తడంతో నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరింత జాప్యం జరగనుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాగులు కూడా పొంగి పొర్లడం, చెరువులకు గండి పడటంతో దేవాదుల ప్యాకేజ్ -3 లోని పంప్ హౌస్, సర్జ్ పూల్ లోకి కూడా వరద నీరు ముంచెత్తింది.
మరో నెల రోజుల వ్యవధిలో సర్జ్ పూల్ పనులు పూర్తి కావాల్సి ఉన్న తరుణంలో తీవ్రవరద తాకిడి ఫలితంగా పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా సర్జ్ పూల్ మొదటి గేట్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్స్ పూర్తి చేసింది. రెండో గేట్ పనులు జరుగుతుండగా వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల ఫలితంగా నిర్మాణ యంత్రాలు, పనిముట్లు నీటిలో మునిగాయి. జూలై నెలలో చరిత్రలో ఎరగని ఈ వరదల ఫలితంగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఆసియాలోనే అతిపొడవైన సొరంగం దేవాదుల ఎత్తిపోతల పథకంలో మేఘా ఇంజనీరింగ్ నిర్మించింది. ప్యాకేజ్ 3లో భాగంగా ములుగు జిల్లా జాకారం నుంచి హనుమకొండ జిల్లా దేవన్నపేట వరకు టన్నెల్ నిర్మించారు. ఈ సొరంగమార్గంలో ఆరు షాఫ్ట్లు, 10 ఆడిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
వీటి గుండా నీరు ప్రవహించి దేవన్నపేట వద్ద నిర్మించిన సర్జ్ పూల్ కు చేరతాయి. 25 మీటర్ల డయాతో 135 మీటర్ల లోతులో సర్జ్ పూల్ ను, అలాగే 141 మీటర్ల లోతులో పంప్ హౌస్ ను నిర్మించారు. ప్రస్తుత ఆకస్మిక వరదలతో ఈ టన్నెల్, సర్జ్ పూల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది.
దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ మిగతా ఎత్తిపోతల కంటే భిన్నంగా రూపుదిద్దుకుంది. రామప్ప చెరువు నుంచి 4 కిలో మీటర్ల దూరంలో 5.6 డయాతో అప్రోచ్ టన్నెల్ ఎంట్రీ పోర్టర్ ను నిర్మించారు. అక్కడ నుంచి 49 కిలో మీటర్ల మార్గంలో నీరు ప్రవహించే విధంగా టన్నెల్ ను నిర్మించారు.
టన్నెల్ మార్గంలో నీరు ప్రవహించి దేవన్నపేట వద్ద నిర్మించిన సర్జ్ పూల్ కు చేరుతాయి. దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌస్ లో మూడు పంపులు, మూడు మోటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మోటరు సామర్థ్యం 31 మెగావాట్లు. సర్జ్ పూల్ నుంచి లిప్ట్ చేసిన నీరు మూడు పంపుల ద్వారా ఆరు కిలో మీటర్లు పొడవునా నిర్మించిన పైపు లైన్ ద్వారా ధర్మాసాగర్ చెరువులోని డెలివరీ సిస్టమ్ ద్వారా చేరుతాయి.