AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు సీఎం KCR కీలక విజ్జప్తి.. అధికారులకు తక్షణ ఆదేశాలు

రాష్ట్రంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు.

Telangana: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు సీఎం KCR కీలక విజ్జప్తి.. అధికారులకు తక్షణ ఆదేశాలు
CM KCR
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2022 | 6:16 PM

Share

CM KCR: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో., తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ.. వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి KCR ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేసిన సిఎం.. బుధవారం నాడు ప్రగతి భవన్ లో వానలు వరదల పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా ఇటు గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలుదాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో నదిమీది ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన చర్యలకు ఫోన్లో అదేశాలిస్తున్నారు సీఎం కేసిఆర్. వరదల వల్ల రవాణా విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను సిఎం ఆరా తీస్తున్నారు.

గోదావరి నది(Godavari River) మీది కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ఇంకా వరద పెరుగుతున్నదని అధికారులు సిఎం కు వివరించారు. ఈమేరకు ముంపు కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించారు. అక్కడే వుండి రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్న స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఫోన్లో సిఎం తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ మరియు ఇతర వరదముంపుకు గురౌతున్న పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను సిఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సిఎం ఆదేశించారు. ఎక్కడకూడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సిఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సిఎం ఆదేశాలిచ్చారు. భద్రాచలం లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్తితిని చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో సిఎం కెసిఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సిఎండీ లు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్ లను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్దరణ చేపట్టామని,మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్దరిస్తున్నట్టు సిఎండీ రఘురామారెడ్డి సిఎం కు వివరించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను పట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని సిఎం అన్నారు. దేవాదుల ప్రాజెక్టుల పనులు పురోగతి లో ఉన్న నేపథ్యంలో వరదనీరు చేరుకోవడం తో తక్షణ చర్యలు చేపట్టి వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్ రావుకు సిఎం కెసిఆర్ ఆదేశించారు.

వానలు వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎస్ డిజిపిలను సిఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే ప్రజలెవరూ కూడా బయటకు వెల్లవద్దని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో అడిగి తెలుసుకుని ఆదేశాలు జారీచేశారు. ఎట్టిపరిస్థితుల్లో పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలు విడిచి వెల్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను ఎమ్మెల్యేలను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

తెలంగాణ వార్తల కోసం..