Rains and Floods: గండిపడ్డ చెరువులు.. దెబ్బతిన్న రోడ్లు.. జలమయమైన గ్రామాలు, ఆంధ్రా-తెలంగాణలో బీభత్స దృశ్యాలు
ఆంధ్రా-తెలంగాణలో వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. గండిపడ్డ చెరువులు, దెబ్బతిన్న రోడ్లు
Heavy Rains and Floods: ఆంధ్రా-తెలంగాణలో వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. గండిపడ్డ చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, జలమయమైన గ్రామాలు. నీట మునిగిన పంటపొలాలు.. ఇలా ఎటూ చూసిన వర్ణనాతీతంగా మారాయి పరిస్థితులు. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోనే కాదు జిల్లాల్లో కూడా వర్షాలు అంతే బీభత్సం సృష్టించాయి. నల్గొండ జిల్లాలో కురిసిన వానకు నరసింహులగూడెం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైకుపై వెళ్తున్న వ్యక్తులు ఇద్దరు నీళ్లలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లకు వర్షాలు, వరదల కొండంత కష్టాన్ని తెచ్చాయి. కొత్తపల్లి వాసులు రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు తీసుకునేందుకు బజార్‌హత్నూర్‌కి వచ్చి వరదలో చిక్కుకుపోయారు. ప్రాణాల్ని పణంగా పెట్టి వాగు దాటుతున్నారు. భారీ వర్షం కారణంగా నిర్మల్ జిల్లాలోని వాడి గ్రామం దగ్గరున్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వాడి-కోతల్‌గామ్ గ్రామాలకు బాహ్య సంబంధాలు తెగిపోయాయి.
ఆంధ్రాలోనూ భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కురిసిన వానకు చెరువులకి గండి పడ్డాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒదులపల్లి దగ్గర ఐదు చెరువులకు గండి పడింది. దీంతో కదిరి-పులివెందులకు వెళ్లే మార్గంలోని కల్వర్టు తెగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులోని నలుగురిలో ఒకరు మృతి చెందగా..మరొకరు గల్లంతయ్యారు. ఇద్దరు సేఫ్‌గా బయటపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కూడా రాత్రి పడ్డ వర్షానికి జలమయం అయింది. RRపేట, ఆర్టీసీ బస్ డిపో, కలెక్టరేట్ రోడ్డు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. ఏలూరు టౌన్‌లోని ప్రధాన రహదారులపై కూడా నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి సైతం వర్షపునీరు చేరింది. కడప జిల్లాలోని మోట్నూతలపల్లేను వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో పులివెందుల – కదిరి రూట్‌లో వాహకపోకలు స్తంభించాయి. మోట్నూతలపల్లేలో వర్షపునీటిలో 3ఆవులు,8 గేదెలు 3బైక్‌లు, 2ఎడ్ల బండ్లు కొట్టుకుపోయాయి.
కృష్ణా జిల్లా చందాపురం, అడవిరావులపాడు మధ్య ఉన్న నల్లవాగు పొంగిపొర్లుతోంది. దీంతో నందిగామ,చందర్లపాడు మధ్య వాహనాలు వెళ్లలేని పరిస్థితి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు ఎవర్ని వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక్క వర్షానికే రెండు రాష్ట్రాల్లో ఇలాంటి వరద పరిస్థితులు తలెత్తితే…రాబోయే మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో మరింత భయాందోళన చెందుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.
ఇక, రాత్రి కురిసిన వర్షం నుంచి హైదరాబాద్ ఇంకా పూర్తిగా బయటపడలేదు. 3గంటల పాటు దంచికొట్టిన వానకు చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. జూబ్లిహిల్స్ , ఎల్బీనగర్, అమీర్‌పేట, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్‌లో వర్షపు నీరు పలు కాలనీల్ని ముంచింది. సరూర్‌నగర్ పరిధిలోని కోదండరామనగర్ కాలనీలో మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది. ఇళ్లలో ఉన్న వాళ్లు నిత్యవసర వస్తువులు, పాల ప్యాకెట్ల కోసం బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది.
Read also: Infant in Bush : పాపం పసికందు..! విశాఖ జిల్లా భోగాపురంలో అమానవీయ ఘటన