Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కొత్త క్యాంపస్‌తో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
HCL New Campus in Hyderabad: హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్త క్యాంపస్‌ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త సదుపాయంలో అదనంగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇటీవల సచివాలయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies) కొత్త క్యాంపస్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ కొత్త సదుపాయంలో అదనంగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇటీవల సచివాలయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రోష్ని నాడార్, హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. విద్య, నైపుణ్యాభివృద్ధిపై వారు చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంతో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం గురించి ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి, విద్యా వనరులను విస్తరించేందుకు హెచ్‌సీఎల్ భాగస్వామ్యంపై ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం ఉండాలని సీఎం కోరారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్‌సీఎల్ కృషికి సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా హెచ్‌సీఎల్‌తో కట్టుబడి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
హెచ్‌సీఎల్ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన GUVI విభాగం, సాంకేతిక విద్యలో భాషా అవరోధాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరించింది. GUVI ద్వారా దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులు అందించబడుతున్నాయి. తద్వారా పలు ప్రాంతాల నుంచి సాంకేతిక నిపుణులను సులభంగా తయారుచేయగలుగుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యువతకు స్కిల్స్ పెంచాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది.