AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రేమించాడు.. పెళ్లిచేసుకోమంటే.. ప్రైవేట్ ఫొటోలతో ఆ నీచుడు ఏం చేశాడంటే..?

ప్రేమించడం.. శారీరక కోరిక తీర్చుకోవడం.. ఆ తర్వాత ముఖం చాటేయడం. తీరా పెళ్లి చేసుకోవాలని యువతి అడిగితే ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానటూ బెదిరింపులకు దిగడం.. ఇప్పుడు చాలా ప్రేమలు అదేవిధంగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఇటువంటి ఘటనే జరిగింది.

Hyderabad: ప్రేమించాడు.. పెళ్లిచేసుకోమంటే.. ప్రైవేట్ ఫొటోలతో ఆ నీచుడు ఏం చేశాడంటే..?
Boyfriend Blackmails Girlfriend With Private Photos
Krishna S
|

Updated on: Sep 13, 2025 | 8:08 AM

Share

ఈ ఆధునిక కాలంలో ప్రేమకు అర్థమే మారిపోయింది. టైమ్ పాస్ ప్రేమలు తప్పా.. పెళ్లి వరకు వెళ్లే ప్రేమలు చాలా తక్కువనే చెప్పొచ్చు.. ప్రేమ కోసం చావడం, చంపడం, లవర్‌ని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది యువతులు ప్రేమ వేధింపులకు బలయ్యారు. తాజాగా మరో కీచకుడు ప్రైవేట్ ఫొటోలతో యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లికి నిరాకరించడమే కాకుండా ప్రైవేట్ ఫొటోలతో బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి బేగంపేటలో ఒక ఇన్సూరెన్స్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తోంది. 2021లో యువతికి – విద్యాసాగర్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఎస్ఆర్ నగర్‌లోని ఒక హోటల్‌లో తరచూ కలుస్తూ ఉండేవారు. 2022లో యువతి గర్భం దాల్చగా, విద్యాసాగర్ బలవంతంగా అబార్షన్ చేయించాడు.

ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తీసుకురాగా, విద్యాసాగర్ ఆమె ఫోన్ నంబర్, సోషల్ మీడియా అకౌంట్‌లను బ్లాక్ చేశాడు. దీంతో యువతి విద్యాసాగర్ తల్లిదండ్రులను కలిసింది. కానీ వారు కూడా తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని విద్యాసాగర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..