G Kishan Reddy: ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం.. దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి

దక్షిణాదిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతోంది. ఈ వ్యూహంలో తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కీలకంగా మారారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌కు ఆయనపై అత్యంత నమ్మకమే దీనికి కారణం. వారి నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో కిషన్ రెడ్డి తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

G Kishan Reddy: ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం.. దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
PM Modi, Amit Shah, Kishan Reddy
Follow us
Vidyasagar Gunti

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 06, 2025 | 3:49 PM

ఉత్తరాది ఊపుతో దక్షిణాన పాగా వేయాలని కేంద్రంలోని అధికార బీజేపీ పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి చాలా ఏళ్లుగా పక్కా వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాన పార్టీ బలోపేతంపై ఫోకస్‌లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కార్యచరణను అమలు చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఓ నేత వైపు చూస్తోంది. ఈ  ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఆ నేతకు ఇటు పార్టీ వ్యవహారాలు, అటు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారు. ఆయనెవరో కాదు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి అధిష్టానం వద్ద ప్రాధాన్యత రోజురోజుకు పెరిగిపోతుంది. మోడీ, అమిత్ షాలకు కిషన్ రెడ్డి పనితీరుపై అమితమైన నమ్మకముంది. దీంతో ఇటు పార్టీ.. అటు ప్రభుత్వ పరంగా ఆయనకు కీలక పదవులు, బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించిన హైకమాండ్.. రెండోసారి కేంద్రమంత్రిగా అవకాశం కల్పించింది. అలాగే సార్వత్రిక ఎన్నికలకు తమిళనాడు ఎన్నికల ఇన్ చార్జ్ గా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జ్ గా కూడా కిషన్ రెడ్డి వ్యవహరించారు. పార్టీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని కిషన్ రెడ్డి.. తొలిసారి జమ్ముకాశ్మీర్‌లో బీజేపీకి అత్యధిక సీట్లు సాధించేలా రాజకీయ చతురతను ప్రదర్శించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. ఇక్కడ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్ఠానం టార్గెట్ పెట్టుకుంది. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రిగా బిజీగా ఉన్నారు. అయినా దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి కీలక వ్యక్తిగా కిషన్ రెడ్డే వ్యవహరిస్తున్నారు.

తాజాగా కిషన్ రెడ్డికి సంస్థాగతంగా మరో కీలక బాధ్యతను అప్పగించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల ఎంపికకు ఆయా రాష్ట్రాలకు ఇన్ చార్జులను అధిష్టానం ఎంపిక చేసింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించారు. దీంతో సౌత్ పై ఫోకస్ లో భాగంగా తెలంగాణతో పాటు తమిళనాడులో పార్టీ బలోపేతంలో భాగంగా అన్ని తెలిసిన కిషన్ రెడ్డే సరైన వ్యక్తిగా మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నా పార్టీ వ్యవహారాల్లోనూ కిషన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కేడర్ చర్చించుకుంటోంది.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికలో భాగంగా ఈ సారి దక్షిణ భారతం నుంచి ఎంపిక చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో కిషన్ రెడ్డి పేరును కూడా బీజేపీ జాతీయాధ్యక్షుడిగి అధిష్ఠానం పరిశీలించిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కిషన్ రెడ్డి సున్నితంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా దక్షిణాదిన బీజేపీకి బలమైన నేతగా.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలుస్తున్నారు. సౌత్ అనగానే బీజేపీ అగ్రనేతలంతా కిషన్ రెడ్డి వైపే చూస్తున్నారంటే ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు.