Telangana: ఆదివారం వచ్చిందంటే ఆ గ్రామంలో నాన్-వెజ్ బంద్.. కారణం తెలిస్తే
ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గ్రామంలో అయినా రుచికరమైన మాంసం వంటకాలతో ఘుమఘుమల వాసనలు.. ఇక మద్యం ప్రియులు అయితే మాంసం, మందుతో అదివారం ఎంజాయ్ చేస్తారు. ఆ వివరాలు ఇలా..
ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గ్రామంలో అయినా రుచికరమైన మాంసం వంటకాలతో ఘుమఘుమల వాసనలు.. ఇక మద్యం ప్రియులు అయితే మాంసం, మందుతో అదివారం ఎంజాయ్ చేస్తారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఆదివారం మద్యాన్ని, మాంసానికి దూరంగా ఉండి భక్తిభావంతో ఆదర్శంగా నిలిచే ఓ ఊరు ఉందని మీకు తెలుసా..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దపూర్ గ్రామంలో ఆదివారం రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉంటారు. ఆదివారం రోజున కేవలం కూరగాయలు, పప్పులతోనే శాఖాహార భోజనం చేస్తారు. ఈ గ్రామంలో మల్లన్న స్వామిని అరాధ్యంగా కొలుస్తుంటారు. మల్లన్న స్వామి దేవునికి ఇష్టమైన ఆదివారం రోజున నిష్టతో ఉండి ఆదివారం పూజలు చేస్తుంటారు. మల్లన్న స్వామిని మొక్కుకున్న వారికి ఇంట్లో కొంగు బంగారంగా మారుతాడు.
గ్రామంలో ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో తలస్నానాలు చేసి పిల్లాపాపలతో కుటుంబం అంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామంలో ఆదివారం రోజు ఎంతో నిష్టగా ఉంటారు. ఈ రోజున గ్రామంలో ఏ శుభకార్యాలు నిర్వహించరు. శుభకార్యాలు తప్పని పరిస్థితులలో చేయాల్సి వచ్చినా శాఖాహార కూరగాయల భోజనాలతో వడ్డిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సంవర్సారాలుగా మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ అదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ప్రతి ఏటా హోళీ పండుగ తరువాత వచ్చే ఆదివారం రోజున మల్లన్న స్వామికి పెద్ద ఎత్తున 30 వేల వరకు బోనాలు సమర్పిస్తుంటారు. ఈ బోనాల ఉత్సవానికి మన రాష్ట్రంతో పాటుగా మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు.