Hydra: అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్ట మవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం పీక్స్‌కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది...

Hydra: అసలేంటీ 'హైడ్రా', ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?
Hydra Demolitions
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 26, 2024 | 12:00 PM

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం పీక్స్‌కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ అసలు ఏంటీ హైడ్రా.? దీని పని ఏంటి.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన హైడ్రా అసలు లక్ష్యం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటీ హైడ్రా..

హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు.

హైడ్రాకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తుండగా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మోహటంగా కూల్చేసే పనిలో పడింది హైడ్రా. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడగు వేసేది లేదని చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఏం చేశారు..

ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు 166 ఆక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది. మొత్తం 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటిలో అత్యధికంగా గాజులరామారంలోని చింతల్‌ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్‌లోని భూమ్రుక్‌ డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌కు తాగు నీటిని అందిస్తున్న గండిపేట్‌ చుట్టూ 24, ఖాన్‌పూర్‌లో 14, చిల్కూర్‌ ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.

రాజకీయాలకు అతీతంగా..

సాధారణంగా ఇలాంటి అంశాలు రాజకీయంగా వివాదానికి దారి తీస్తాయని తెలిసిందే. అయితే హైడ్రా విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తగ్గేది లేదంటోంది. నిన్నటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన విషయం తెలిసిందే. గీతలో కృష్ణుడు చెప్పిన పనినే తాము చేస్తున్నామని అన్నారు. హైడ్రా చేస్తున్న పని తమ పార్టీలో కూడా కొందరికి నచ్చక పోవచ్చని కానీ చర్యలు తీసుకోవడం మాత్రం ఆగదని స్పష్టం చేసి రాజకీయంగా హీట్‌ పెంచారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎమ్‌ఐఎం పార్టీలకు చెందిన వారి నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చి వేసింది. చింతల్‌లో చెరువును స్థానిక బీఆర్‌ఎస్‌ నాయుడు ఆర్‌ సాయి రాజు, బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందరకు సంబంధించి నందగిరి కొండల్లో ఉన్న నిర్మాణాలను, రాజేంద్ర నగర్‌లో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌, ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దీంతో రాజకీయాలకు అతీతం హైడ్రా పనిచేస్తుందని చెప్పకనే చెప్పారు.

విపక్షాలు ఏముంటున్నాయి.?

హైడ్రా చర్యలు ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు అని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాను లీజుకు తీసుకున్న జన్వాడలోని ఫామ్‌ హౌజ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాంగ్రెకు చెందిన మాజీ ఎంపీ కెవిపి, గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్‌ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం కొందరి ఆస్తులపైనే దాడులు చేయడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

ఇక బీజేపీ విషయానికొస్తే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతి ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా అంటూ ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మెదక్‌ ఎంపీ రఘునందన్‌.. నాగార్జున కన్వెక్షన్‌ సెంటర్‌ కూల్చడం సరైందేనని, ఇతర అక్రమ నిర్మాణాలను సైతం కూల్చేయాలన్నారు. ఇక బీజేపీలో మరో సీనియర్‌ లీడర్‌.. ఎంపీ ఈటల రాజేందర్‌ సైతం ఈ విషయమై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు పేదలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయన్నారు. తాను అద్భుత పాలకుడినని, ఆయన నిక్కచ్చిగా ఉండే ఆఫీసర్ అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన గుర్తింపు కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం హైడ్రాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలు అన్నింటిని కూల్చేస్తామనడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆ పరిధుల్లో ప్రైవేటు కట్టడాలతోపాటు ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరి వాటిని కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు పరిస్థితి ఏమిటీ? తొలగిస్తారా? అని అడిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉన్న చోట గతంలో ఓ కుంట ఉండేదని వివరించారు. ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ఉందని, దాన్ని కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. మరి హైడ్రా తన దూకుడును ఇలాగే కొనసాగిస్తుందా.? లేదా అనేది తెలియాలంటే కాలమే నిర్ణయించాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..