ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు.. ఎలాంటి డిగ్రీలు లేని శాస్త్రవేత్త.. 150 వెరైటీల వరి పండించిన అగ్రికల్చర్ డాక్టర్!
అన్నదాత ఎవరైనా ఒక రకం పంట పండిస్తాడు.. లేదా సన్న దొడ్డు ధాన్యాలు రెండు పండిస్తారు..కానీ, నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆదర్శ రైతు మాత్రం 150 రకాల వరి రకాలు పండించారు.. అవి కూడా ఇప్పటివి కాదు.. తాత ముత్తాతలు తిన్న రకాలు... అంతే కాదు.. తన మూడెకరాల పొలాన్ని ఒక ప్రయోగ శాలగా మార్చిన రూరల్ సైంటిస్ట్ అతను.. అగ్రికల్చర్ డాక్టర్ అని కూడా అనొచ్చు.. 72 ఏళ్ల వయసులో కూడా భావి తరాల మార్పు కోసం ప్రాచీన వరి వంగడాలు తెలుగు లోకానికి పరిచయం చేస్తున్నాడు ..అంతే కాదు తన తల్లి దండ్రుల చిత్రాలను వరి పంట రూపంలో పండించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆయన తాజాగా ఈ సీజన్ లో సుదర్శన చక్రంతో పాటు తన విజిటింగ్ కార్డు ప్రతిదీ వరి పంటగా వేశాడు. ఎలాంటి డిగ్రీలు లేవు,శాస్త్రవేత్త అసలే కాదు.. అయినా ప్రకృతి వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు.

ఎరుపు రంగులో ధాన్యం.. లోపల నల్లటి బియ్యం.. మరొకటి సాధారణంగా కనిపించే ధాన్యం.. లోపల మాత్రం ఎర్రని బియ్యం.. ఇలా ఎన్నో రకాలు. కొన్నింటిలో పోషకాలు చాలా ఎక్కువ. మరికొన్నింటిలో దిగుబడి ఎక్కువ. బాగా చిన్నగా ఉండేవి కొన్ని, గుండ్రంగా ధనియాల్లా కనిపించే బియ్యం రకాలు ఇంకొన్ని.. ఇవన్నీ ఎక్కడెక్కడో కాదు. ఒకేచోట పండుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్నగంగారాం నిజామాబాద్ శివారులోని గూపన్ పల్లి గ్రామంలో పూర్తి సేంద్రియ విధానంలో వీటిని పండిస్తున్నారు… ఒక్కటి కాదు ఇప్పటివరకూ 150 రకాల ప్రాచీన నాటు వరి రకాలు పండించారు.. ఈసారి 53 రజలతో మరోసారి ప్రయోగాలు చేస్తున్నారు.. వ్యవసాయ రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు ఈసారి 53 వరి వంగడాలను నాటారు.. నిజామాబాద్ పరిధిలోని గూపనపల్లిలోని చిన్ని కృష్ణుని వ్యవసాయ క్షేత్రం ఇందుకు వేదికగా మారింది.. అంతేనా ఇంకా మరో రెండు విశేషాలు కూడా దాగి ఉన్నాయి.. ఒక మడిలో సూర్యుడి కిరణాలు.. మరో మడిలో ఏకంగా తన విజిటింగ్ కార్డు ఆకారం వేయబోతున్నారు.. ఇప్పటికే రంగు రంగుల నారు మడులు సిద్ధం చేశారు..
ఒక యోగా గురువు వద్ద సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలుసుకున్న చిన్ని కృష్ణుడు.. 2007లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఏకంగా 110 రకాల వరి విత్తనాలను సేకరించి సాగు చేశారు.. ఇందులో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు పలు ఇతర దేశాల వరి రకాలు కూడా ఉండటం విశేషం.. తాను సాగు చేసిన వివిధ రకాల వరి విత్తనాలను ఇప్పటికే 8 రాష్ట్రాలకు చెందిన 570 మంది రైతులకు అందించారు.. సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి. కానీ చిన్ని కృష్ణుడు బియ్యం నుంచి మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు. అమెరికా నుంచి తెచ్చిన కాలిఫోర్నియా రైస్, ఇటలీ నుంచి తెచ్చిన రిసోట రకం బియ్యం నుంచి మొలకలు వచ్చేలా చేసి సాగు చేశారు..
చిన్ని కృష్ణుడు అనేక వింత ప్రాచీన ఆరోగ్య విలువలు కలిగిన ముత్తాతలు తిన్న వరి రకాలను సేకరించి పరిచయం చేశారు.. అందులో కొన్నింటి గురుంచి తెలుసుకుందాం..
రత్నాచోళి: పోషకాలు ఉన్న ఈ బియ్యం తింటే కండరాలు గట్టి పడతాయని చెప్తారు.
మాపిళ్లై సాంబ: ఈ బియ్యం తింటే వీర్య కణాలు, అండకణాలు పెరుగుతాయని చిన్ని కృష్ణుడు చెబుతున్నారు.
గంగా జపనీ గ్రీన్ బ్లాక్ రైస్: ఇది 110 రోజుల పంట. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి.
కర్పూకౌని: ఈ బియ్యం తింటే శరీరంలోని పని కిరాని కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్తారు.
గంగా రూబీ రెడ్ రైస్: వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం చిరుధాన్యాలతో సమానం.
ఫర్ బిడెన్ రైస్: ఇది చైనా రకం. ఈ బియ్యం నీళ్లల్లో వేస్తే వండే పని లేకుండా రెండుగంటల్లో అన్నం అవుతుంది..
కాలజీర: పరమాన్నం (పాయసం) స్పెషల్. పైరు ఏకంగా 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది
చిన్నపొన్ను: తమిళనాడు రకం.ధనియాల మాదిరిగా ఉంటాయి. పైరు 2 అడుగుల వరకు పెరుగు తుంది.
గంగాగోల్డెన్ బ్రౌన్స్: అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గోల్డెన్ బ్రౌన్ రైస్ (బియ్యం) తీసుకొచ్చి వాటి నుంచి మొలకెత్తించారు. ఇది ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే రకం.
గంగా స్వీట్ బ్రౌన్స్: ఇది ఒక అడుగు మాత్రమే పెరుగుతుంది. నష్టం తక్కువ. గింజలు త్వరగా రాలిపడవు.
మెడిసినల్ రెడ్ రైస్: ధాన్యం సాధారణ రంగులో ఉన్నా.. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. ఈ బియ్యంలో 18 రకాల పోషకాలు ఉంటాయి. ఐదేళ్లు దాటినా ఈ ధాన్యం బూజు, దుబ్బ, పురుగు పట్టదు. ఇది దేశవాళీ రకం.
కుంకుమ బంతులు (బుడుమ వడ్లు): తెలంగాణలోని నల్లగొండ ప్రాంతానికి చెందినవి. దిగుబడి తక్కువ అయినా బలం ఎక్కువ.
గంగా గ్రీన్ బ్లాక్ రైస్: ఇది జపాన్ నాటురకం. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. దిగుబడి ఎక్కువగా వస్తుంది.
రిసోట రైస్: ఇది ఇటలీ రకం. ధాన్యం లావుగా గుగ్గిళ్లలా ఉంటుంది. ప్రతి గింజకు ముల్లు ఉంటుంది..
మన దేశంలో వందేళ్ల క్రితం 40 వేల రకాల వరి విత్తనాలు ఉండేవని, వాటిలో 30 వేల రకాలు కనుమరుగయ్యాయని చిన్ని కృష్ణుడు అంటున్నారు. మిగతా రకాలను ఔత్సాహిక రైతులు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. అందులో కొన్ని దేశవాళీ రకాలు ఎంతో ప్రత్యేకమైనవని వెల్లడించారు. తనవద్ద ఉన్న 110 రకాల్లో 30 రకాలను రోజూ ఒక రకం బియ్యం అన్నం తింటున్నామని రైతు చిన్ని కృష్ణుడు చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
చిన్ని కృష్ణుడు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు.. అలాంటివి ఎపుడూ చూసి ఉండం కూడా.. వరి పైరుతో తల్లిదండ్రుల చిత్రం వేయించారు.. అమ్మానాన్నలపై తనకున్న ప్రేమకు చిహ్నంగా వరిపైరుతో వారి చిత్రాన్ని ఆవిష్కరించారు.. మొదట.. తన తల్లిదండ్రులు భూదేవి, ముత్తెన్న చిత్రాలను ఎకరం విస్తీర్ణంలో బొమ్మ గీయించారు. అనంతరం బంగారు గులాబీ, పంచరత్న, చింతలూర్ సన్నాలు రకం వరి వంగడాలతో వరినారు పెంచారు. 24 రోజుల తర్వాత కూలీలతో నిర్దేశించిన స్థానాల్లో నాట్లు వేయించారు. పంట కోతకు వచ్చేకొద్దీ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించాయి.. డ్రోన్ నుంచి తీసిన ఫొటోలు వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు..
మరోసారి శివ లింగం ఆకారం దేవాలయం కూడా వరి నారుతో వేశారు.. అప్పుడు అనేక మంది జనాలు భక్తులు స్కూల్ పిల్లలు అక్కడికి వెల్లి ఆ ఆలయం ఆకారం లోపల శివ లింగాన్ని దర్శించుకొని వెళ్లారు..
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు చిన్ని కృష్ణుడు అనేక అవార్డులు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భరత్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులను అందుకున్నాడు. దీంతో పాటు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేష నల్, ట్రెజర్ వరల్డ్ రికార్డ్స్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, ఫ్రీడమ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోకస్ వరల్డ్ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఫోరమ్, స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా, డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే మరో 11 అవార్డులను హైదరాబాద్లో ఒకే వేదికపై ప్రదానం చేశారు.. ఇలా మొత్తంగా చిన్ని కృష్ణుడికి అనేక అవార్డులు వరించాయి. ఇపుడు గిన్నిస్ బుక్, పద్మశ్రీ అవార్డులకోసం దరఖాస్తు చేసుకున్న ఈ వృద్ధ రైతు ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




