AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది విన్నారా? తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు! ఏవంటే..?

తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ ఆరు రెట్లు పెరిగి రూ. 5,454 కోట్లకు చేరింది. రూ.47,984 కోట్ల ప్రాజెక్టులతో కనెక్టివిటీ, ప్రయాణ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మహబూబ్‌నగర్ స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద రూ.40 కోట్లతో విమానాశ్రయం తరహా సౌకర్యాలతో ఆధునికీకరించబడుతోంది.

ఇది విన్నారా? తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు! ఏవంటే..?
Represntive Image 1
SN Pasha
|

Updated on: Mar 15, 2026 | 6:00 AM

Share

తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తున్న రైల్వే నిధులు గణనీయంగా పెరిగాయి. 2009 నుంచి 2014 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు సగటున సంవత్సరానికి రూ.886 కోట్ల రైల్వే బడ్జెట్ మాత్రమే లభించేది. అయితే ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో రూ.5,454 కోట్లను కేటాయించారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు పెరిగినట్లు లెక్క. ప్రత్యేకంగా చూస్తే 2014–15 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేవలం రూ.258 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అదే కేటాయింపు దాదాపు ఇరవై రెట్లు పెరిగి రూ.5,454 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

ప్రస్తుతం భారతీయ రైల్వేలు తెలంగాణలో రూ.47,984 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఇందులో కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధి, భద్రతా సదుపాయాల మెరుగుదల వంటి పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీతో పాటు ప్రయాణ సౌకర్యాలు కూడా మెరుగుపడనున్నాయి. ఇక మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. పునరాభివృద్ధి తర్వాత ఈ స్టేషన్‌లో విమానాశ్రయం తరహా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఆధునిక టాయిలెట్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్టేషన్ చరిత్ర 19వ శతాబ్దం చివరికి చెందినది. హైదరాబాద్ నుంచి మీటర్ గేజ్ రైల్వే లైన్ పనులు 1888లో ప్రారంభమై 1892లో పూర్తయ్యాయి. తరువాత 1922లో ఇక్కడ ప్రయాణికుల రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్టేషన్ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక భవనాల ద్వారా సేవలు అందిస్తున్నారు.

మహబూబ్‌నగర్ స్టేషన్‌లో రోజుకు దాదాపు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టెర్మినల్ భవనం విమానాశ్రయ శైలిలో రూపొందించబడుతోంది. అదే సమయంలో జడ్చర్ల, గద్వాల్, జోగులాంబ రైల్వే స్టేషన్లను కూడా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టేషన్ల అభివృద్ధికి జడ్చర్లకు రూ.36.67 కోట్లు, గద్వాలకు రూ.42.82 కోట్లు, జోగులాంబకు రూ.6.7 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలోని ప్రయాణికులకు కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us